తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఓటు వేయాలన్న సంకల్పంతో.. వంతెన కట్టేశారు!

స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు గడిచిందని ఓవైపు దేశం సంబరాలు చేసుకుంటుంటే.. మరోవైపు ఇప్పటికీ అనేక ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. బిహార్​లో పరిస్థితులు ఇంకా దారుణం! కనీస మౌలిక వసతులు లేకపోవడం వల్ల రాష్ట్రంలోని అనేక గ్రామాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గయాలోని శంకర్​ బిఘా గ్రామంలో సరైన రోడ్లు కూడా లేవు. వంతెన లేకపోవడం వల్ల వేరే ప్రాంతాలకు వెళ్లాలంటే అతి కష్టం మీద నదిని దాటాల్సి వస్తోంది. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో ఓటు వేయాలి, వంతెనను నిర్మించాలని అధికారులను అభ్యర్థించినా ఫలితం దక్కలేదు. దీంతో గ్రామస్థులు ఓ తాత్కాలిక వంతెనను కట్టేశారు.

Gaya have constructed a temporary bridg

By

Published : Sep 26, 2021, 3:58 PM IST

Updated : Sep 26, 2021, 4:27 PM IST

గ్రామస్థులే వంతెన నిర్మిస్తూ..

ఎక్కడైనా ఎన్నికలు వస్తున్నాయంటే.. అభివృద్ధి పనులు చకచకా జరిగిపోతాయి! కొత్త రోడ్లు వస్తాయి.. కొత్త నీటి పంప్​లు వస్తాయి. ఇలా చాలా వరకు అన్నీ కొత్తకొత్తగా కనిపిస్తాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలే అన్ని పనులు దగ్గరుండి మరీ చేయిస్తారు! కానీ బిహార్​ గయాలోని శంకర్​ బిఘా గ్రామంలో పరిస్థితులు ఇందుకు పూర్తిగా భిన్నం. ఈ నెల 29న జరగనున్న స్థానిక ఎన్నికల్లో పాల్గొనేందుకు ప్రజలు తహతహలాడుతున్నా ఓటు వేయలేని దుస్థితి. వారి గ్రామంలో ప్రవహిస్తున్న నదిపై వంతెన లేకపోవడం వల్ల పోలింగ్​ బూత్​కు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. నిత్యజీవితంలో అధికారుల నుంచి సహాయం లేకపోయినా ఇన్నేళ్లు ఏదో ఒక విధంగా నెట్టుకొచ్చారు. కానీ ఈసారి ఎన్నికల్లో కచ్చితంగా ఓటు వేయాలన్న సంకల్పంతో పెద్ద నిర్ణయమే తీసుకున్నారు. వెంటనే గ్రామస్థులంతా కలిసి నదిపై తాత్కాలిక వంతెనను నిర్మించేశారు.

వంతెన నిర్మించుకుంటూ..

"29న ఎన్నికలు ఉన్నాయి కదా.. అందుకే ఈ వంతెన​ నిర్మించాము. వంతెన​ లేకుండా నది దాటుకుని వెళ్లి ఓటు వేయడం చాలా కష్టం. ఎన్నికల కోసం అందరం కలిసికట్టుగా బ్రిడ్జ్​ను నిర్మించాము. అభివృద్ధి కోసం పాటు పడే అభ్యర్థి, యువ నేతను ఎన్నుకునేందుకు గ్రామంలో చాలా మంది ఆసక్తిగా ఉన్నారు. మేము ఓటే వేయకపోతే అసలు మంచి నేత ఎలా ఎదుగుతాడు? అందుకే ఇలా చేశాము."

-- నీరజ్​ కుమార్​, గ్రామస్థుడు.

ఓటు వేయాలన్న సంకల్పం తమకు ఉన్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా.. తమ ఇబ్బందులను లెక్కచేయడం లేదన్నారు. అధికారుల నుంచి ఎలాంటి సహాయం అందదని గుర్తించి.. గ్రామస్థులంతా కలిసి వంతెన నిర్మించినట్టు వెల్లడించారు. ఈ నెల 29న జరగనున్న ఎన్నికల్లో కచ్చితంగా ఓటు వేస్తామని, తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకుంటామని స్పష్టం చేశారు.

నదిపై తాత్కాలిక వంతెన నిర్మాణం

గ్రామస్థులు వంతెన నిర్మిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. "ఈ బ్రిడ్జ్​.. ప్రభుత్వం కట్టించిన దాని కన్నా దృఢంగా ఉంటుంది" అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

వంతెన నిర్మించుకున్న గ్రామస్థులు

అంతకుముందు.. ప్రభుత్వ సహకారం లేకుండానే కాలువపై వంతెనను నిర్మించి వార్తల్లోకెక్కింది కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలోని గ్రామం మోగ్ర. బ్రిడ్జి కోసం ఏళ్లుగా డిమాండ్​ చేస్తున్నా.. నేతలు చూసీచూడనట్టు వ్యవహరిస్తుండటం వల్ల, తామే స్వయంగా వంతెన నిర్మించి అందరి చూపు తమ వైపు తిప్పుకున్నారు.

ఈ పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఇవీ చూడండి:లాక్‌డౌన్‌లో శ్రమదానం.. సొంతంగా రోడ్డు వేసుకున్న గ్రామస్థులు

గ్రామస్థులు ఇచ్చిన డబ్బుతో ఒలింపిక్స్​కు.. పతకంతో స్వదేశానికి

Last Updated : Sep 26, 2021, 4:27 PM IST

ABOUT THE AUTHOR

...view details