బిహార్‌లోని బక్సర్‌లో బుధవారం రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి పోలీసుల వ్యాన్‌కు నిప్పంటించారు. అనేక ప్రభుత్వ వాహనాలను ధ్వంసం చేశారు. చౌసా పవర్ ప్లాంట్ కోసం సేకరిస్తున్న తమ భూమికి ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్నారు. అయితే నిరసనల్లో పాల్గొన్నందుకు మంగళవారం రాత్రి ఓ రైతు ఇంట్లోకి పోలీసులు చొరబడి కొట్టారంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు. బుధవారం ఇలా ప్రభుత్వ వాహనాలను ధ్వంసం చేశారు.
"రైతులు పవర్ ప్లాంట్‌ను కూడా ధ్వంసం చేశారు. పోలీసులు పరిస్థితిని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఆందోళనలు చేస్తున్న గుంపులను చెదరగొట్టేందుకు మా పోలీసులు గాల్లోకి దాదాపు 6 రౌండ్లు కాల్పులు జరిపారు" అని బక్సర్ ఎస్పీ మనీశ్ కుమార్ చెప్పారు.
భూములకు తగిన పరిహారం చెల్లించాలని కోరుతూ శాంతియుతంగా ఆందోళనలు చేపడుతున్న తమపై పోలీసులు దౌర్జన్యానికి దిగారని రైతులు ఆరోపిస్తున్నారు. పోలీసులు రైతుల ఇంట్లోకి ప్రవేశించి మహిళలు, పిల్లలపైనా లాఠీచార్జ్ చేశారని.. ఫలితంగా చాలా మంది తీవ్రంగా గాయపడ్డారని నిరసనకారులు అంటున్నారు.