Bihar Uterus Removal Scam : బిహార్‌లో 27 వేల మంది మహిళల గర్భాశయాల తొలగింపు కేసులో పట్నా హైకోర్టు సీరియస్ అయ్యింది. బాధితులకు అందజేసిన పరిహారం వివరాలను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. బాధితుల జాబితా తదితర వివరాలకు సవిరంగా అందించాలని కోరింది. వెటరన్ ఫోరమ్ దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం విచారణ జరిపిన పట్నా హైకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు తదుపరి విచారణ ఈ ఏడాది సెప్టెంబరు 1కు వాయిదా వేసింది.
మహిళల గర్భాశయాల తొలగింపు కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి దర్యాప్తు చేపట్టలేదని ధర్మాసనానికి పిటిషనర్ తరఫు న్యాయవాది దిను కుమార్ తెలిపారు. ఈ కేసుపై గతంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ విచారణకు ఆదేశించిందని పేర్కొన్నారు. 40 ఏళ్ల లోపు బాధిత మహిళలకు రూ.2 లక్షలు, ఆ వయసుపైబడినవారికి రూ.1.25 లక్షలు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు కోర్టుకు తెలిపారు. అయినా.. ఎంతమంది బాధితులకు పరిహారం అందించారో ప్రభుత్వ రికార్డులో పొందుపరచలేదని పేర్కొన్నారు.
2017లో పట్నా హైకోర్టులో వెటరన్ ఫోరం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. అందులో జాతీయ ఆరోగ్య బీమా పథకాన్ని(నేషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్) దుర్వినియోగపరుస్తూ బిహార్‌లోని పలు ఆస్పత్రులు, వైద్యులు మహిళల అనుమతి లేకుండానే వారికి గర్భాశయాలను తొలగించే ఆపరేషన్ నిర్వహించారని పేర్కొంది.