Bihar Train Accident :బిహార్‌లోని బక్సర్ జిల్లాలో నార్త్ఈస్ట్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్(రైలు నెం-12506) పట్టాలు తప్పింది. రఘనాథ్పుర్ రైల్వే స్టేషన్లో సమీపంలో బుధవారం రాత్రి 9.53 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో ఆరు బోగీలుపట్టాలు తప్పాయి. ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో 70 మందికి గాయాలయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్.. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
ఇదీ జరిగింది..
North East Express Accident :నార్త్ఈస్ట్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ 23 కోచ్‌లతో దిల్లీ నుంచి గువాహటి సమీపంలోని కామాఖ్యకు ఉదయం 7.40 గంటల సమయంలో బయలుదేరింది. రైలు రఘనాథ్పుర్ రైల్వే స్టేషన్లో సమీపంలోకి రాగానే ఆరు బోగీలు అకస్మాత్తుగా పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో రెండు ఏసీ 3 టైర్ కోచ్‌లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. మరో నాలుగు బోగీలు బోల్తా పడినట్లు అధికారులు తెలిపారు. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రులకు తరలించామని.. తీవ్ర గాయాలైన వారిని పట్నాలోని ఎయిమ్స్‌కు తీసుకెళ్లామని చెప్పారు. ఈ ఘటనపై స్పందించిన రైల్వే శాఖ మంత్రి.. ప్రమాదానికి కారణాలను త్వరలో కనుగొంటామని చెప్పారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
"రైలు సాధారణ వేగంతో వస్తోంది. కానీ అకస్మాత్తుగా మాకు పెద్ద శబ్దం వినిపించింది. రైలు నుంచి పొగలు వచ్చాయి. ఏం జరిగిందో చూడటానికి మేము అక్కడికి పరిగెత్తాము. అక్కడికి వెళ్లి చూసేసరికి రైలు పట్టాలు తప్పింది. AC కోచ్‌లు ఎక్కువగా దెబ్బతిన్నాయి."
--హరి పతాక్, స్థానికుడు