నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ ప్రమాద ఘటనాస్థలిలో సహాయక చర్యల దృశ్యాలు Bihar Train Accident 2023 : బిహార్‌లోని బక్సర్ జిల్లాలో జరిగిన నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాద భయానక అనుభవాలను ప్రయాణికులు గుర్తుచేసుకున్నారు. అకస్మాత్తుగా అంతా కుదుపునకు గురయ్యామని కొందరు చెబుతుండగా.. ప్రమాదం ధాటికి స్పృహ తప్పపడిపోయామని మరికొందరు తెలిపారు. రైల్వే అధికారులు వచ్చేలోపు.. స్థానికులు స్పందించి అనేక మంది ప్రాణాలు కాపాడినట్లు చెప్పారు.
స్పృహ తప్పి పడిపోయిన రైల్వే గార్డు
Bihar Train Accident Victims : నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ఒక్కసారి పట్టాలు తప్పగా.. తాను స్పృహ తప్పి పడిపోయినట్లు రైల్వే గార్డు విజయ్ కుమార్ గుర్తుచేసుకున్నారు. "డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేకులు వేశాడు. ఆ సమయంలో నేను నా పేపర్‌వర్క్‌లో బిజీగా ఉన్నాను. రైలు కుదుపులకు స్పృహతప్పి పడిపోయాను. ఆ తర్వాత స్పృహలోకి వచ్చాక.. పక్కనే ఉన్న పొలాల్లో పడి ఉన్నట్లు గుర్తించాను. స్థానికులు నా ముఖంపై నీరు చల్లి స్పృహలోకి తీసుకొచ్చారు" అని స్వల్ప గాయాలతో ఉన్న విజయ్‌కుమార్ తెలిపారు.
'ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం'
"ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థం కాలేదు. అరుపులు, ఏడుపులు వినిపించాయి. అంతా ముందుకు పడిపోయాం. ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం" అని థర్డ్ ఏసీలో ప్రయాణించిన మహేంద్ర యాదవ్ తెలిపారు. రైల్వే అధికారులు చేరుకునేలోపు.. స్థానికులు తమను కాపాడినట్లు చెప్పారు. "మేం బుధవారం ఉదయం రైలు ఎక్కాం. రాత్రి త్వరగా భోజనం చేసి నిద్రపోయాం. అకస్మాత్తుగా రైలు కుదుపునకు గురైంది. ఒక్కసారిగా బెర్త్‌పై నుంచి కిందపడ్డాను. అసలేం జరిగిందో తెలియడానికి చాలా సమయం పట్టింది" అని నాసిర్ అనే ప్రయాణికుడు తెలిపాడు. తన స్నేహితుడు జాయెద్ మరణించినందుకు బాధగా ఉందని చెప్పాడు.
'నాపై 15 మంది పడ్డారు'
Bihar Train Accident Passenger : రైలు భారీ కుదుపుల వల్ల తనపై 10-15 మంది పడ్డారని దిల్లీ వాసి ఇషాలౌర్ రెహమాన్ గుర్తుచేసుకున్నాడు. "నా చేతికి చిన్న గాయంతో ప్రమాదం నుండి బయటపడటం నా అదృష్టం. కానీ నేను చూసిన ఘటన మరచిపోలేనిది. నేను ప్రయాగ్‌రాజ్‌లో రైలు ఎక్కి నా సీటులో కూర్చున్నాను. అకస్మాత్తుగా భారీ శబ్దం వచ్చింది. అంతా నాపై పడిపోయారు" అని చెప్పాడు.
సహాయ చర్యలు వేగవంతం
Bihar Rescue Operations : దిల్లీ-కామాఖ్యా నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ ప్రమాద ఘటనాస్థలిలో సహాయక చర్యలు చురుగ్గా సాగుతున్నాయి. ప్రమాదం జరిగిన బోగీలను రైలు నుంచి వేరు చేసి పట్టాలను పునరుద్ధరించే పనులను రైల్వే అధికారులు వేగవంతం చేశారు. పట్టాలపై చెల్లాచెదురుగా పడిన బోగీలను పెద్ద పెద్ద క్రేన్ల సాయంతో తొలగించారు.
మరణించిన వారు వీళ్లే..
Bihar Train Accident Death :రైలు ప్రమాదంలో మరణించిన వారిని రైల్వే అధికారులు గుర్తించారు. అసోంకు వెళ్తున్న ఉషా భండారీ(37), ఆమె కుమార్తె అకృతి భండారీ(8) చనిపోయినట్లు తెలిపారు. బాలిక తండ్రి ప్రమాదం నుంచి బయటపడ్డట్లు వెల్లడించారు. వీరితోపాటు రాజస్థాన్‌కు చెందిన నరేంద్రకుమార్, బిహార్‌కు చెందిన అబూ జాయెద్ ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు.
ట్రాక్‌లో లోపమే కారణం!
Bihar Train Accident Reason : నార్త్ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడానికి ట్రాక్‌లో లోపమే కారణం కావచ్చని ప్రాథమికంగా రైల్వే అధికారులు గుర్తించారు. రైలు డ్రైవర్ సహా ఆరుగురు అధికారులు ఇచ్చిన నివేదికలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. ప్రమాదం కారణంగా రూ.52 కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. లోకో పైలట్, అతడి సహాయకుడు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. ఇద్దరికీ బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో నెగిటివ్ వచ్చినట్లు చెప్పారు. ప్రమాద సమయంలో రైలు గంటకు 128 కి.మీ వేగంతో వెళ్తున్నట్లు సమాచారం.
ఉన్నత స్థాయి విచారణకు రైల్వే శాఖ ఆదేశం
Train Accident In Bihar : రైలు ప్రమాద ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపేందుకు ఆదేశించినట్లు తూర్పు మధ్య రైల్వే ఆఫీసర్ బీరేంద్ర కుమార్ తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని ప్రకటించారు. అంతకుముందు, మరణించిన వారి కుటుంబాలకు బిహార్ ప్రభుత్వం రూ.4 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. "ఇది చాలా దురదృష్టకర సంఘటన. ప్రమాదంలో మరణించిన నలుగురి కుటుంబీకులకు రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని మేము నిర్ణయించాం. గాయపడిన ప్రయాణికులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ వైద్యాన్ని అందిస్తోంది" అని బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ తెలిపారు.
ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు
Bihar Train Tragedy :పట్టాలు తప్పిన రైలులోని ప్రయాణికులను తన గమ్యస్థానాలకు చేర్చేందుకు రైల్వే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రత్యుమ్యాయ రైలులో మొత్తం 1,006 మంది తమ గమ్యస్థానాలుకు చేరుకుంటున్నట్లు గువాహటి సీనియర్ రైల్వే అధికారి తెలిపారు. వారందరికీ ఆహారం కూడా అందించినట్లు వెల్లడించారు. నార్త్ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ బుధవారం దిల్లీలో ప్రారంభమైన సమయంలో సుమారు 1500 మంది ప్రయాణికులు రైలులో ఉన్నట్లు చెప్పారు.
మోదీ సానుభూతి..
Bihar Train Incident : బిహార్ రైలు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ.. ఎక్స్(ట్విట్టర్)లో స్పందించారు. "నార్త్ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పి నలుగురు ప్రాణాలు కోల్పోయారని తెలిసి బాధపడ్డాను. మృతుల కుటుంబాలకు సానూభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. బాధితులందరికీ అధికారులు అని విధాల సహాయం చేస్తున్నారు" అని మోదీ రాసుకొచ్చారు.
ఇదీ జరిగింది..
Bihar Train Derailment :దిల్లీ-కామాఖ్య నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ బుధవారం రాత్రి 9.53 నిమిషాలకు బిహార్‌లోని రఘనాథ్‌పుర్ స్టేషన్ వద్ద పట్టాలు తప్పింది. రెండు ఏసీ త్రిటైర్ కోచ్‌లు పట్టాలు తప్పగా.. ఆ కుదుపునకు మరో 4 బోగీలకు ప్రమాదం వాటిల్లింది. అలా 23 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా.. గాయపడిన 70 మంది ప్రయాణికులు స్థానికంగా ఉన్న ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పట్టాలపై బోగీలు పడిపోవడం వల్ల ఆ మార్గంలో తిరిగే 10 రైళ్లను హుటాహుటిన రద్దు చేశారు. 21 రైళ్లను దారిమళ్లించారు.