తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కారు లైట్ల వెలుతురులో విద్యార్థులకు 'పరీక్ష' - car lights exam in bihar

Car lights exam: కాలేజీలో కరెంటు లేక విద్యార్థులు కార్ల వెలుతురులో పరీక్ష రాసిన సంఘటన బిహార్​లో జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్​గా మారటం వల్ల ఇది వివాదాస్పదంగా మారింది.

car lights exam
కారు లైట్ల వెలుతురులో విద్యార్థులకు పరీక్ష

By

Published : Feb 3, 2022, 9:51 AM IST

Car lights exam: బిహార్‌లో సిబ్బంది వైఫల్యం కారణంగా దాదాపు 400 మంది 12వ తరగతి విద్యార్థులు కార్ల హెడ్‌లైట్ల వెలుతురులో పరీక్ష రాయాల్సి వచ్చింది. మోతిహరిలోని మహారాజా హరేంద్ర కిశోర్‌ సింగ్ కాలేజీలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

అసలేం జరిగిందంటే..

బిహార్‌ వ్యాప్తంగా నిన్న 12వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలి పరీక్ష హిందీ రెండు భాగాలుగా నిర్వహించారు. తొలి భాగం పరీక్ష ఉదయం జరగ్గా.. రెండో పేపర్‌ షెడ్యూల్‌ను మధ్యాహ్నం 1.45 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్ణయించారు. అయితే మహారాజా హరేంద్ర కిశోర్‌ సింగ్‌ పరీక్షా కేంద్రంలో ముందస్తుగా విద్యార్థుల సీటింగ్‌ ఏర్పాట్లు చేయకపోవడంతో గందరగోళం తలెత్తింది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితికి అదుపులోకి తెచ్చారు.

ఈ క్రమంలోనే పరీక్ష చాలా ఆలస్యంగా మొదలయ్యింది. విద్యార్థులకు జవాబు పత్రాలు అందేసరికి సాయంత్రం 4.30 గంటలు దాటింది. అప్పుడే అసలు సమస్య మొదలైంది. ఆ కాలేజీకి ఎలాంటి విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో జనరేటర్లతో నడిపిస్తున్నారు. అయితే కొన్ని గదుల్లో ఆ సౌకర్యం కూడా లేక, కొంతమంది విద్యార్థులను కారిడార్లలో కూర్చోబెట్టారు. కానీ అప్పటికే చీకటి పడింది. దీంతో కార్లలో వచ్చిన కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు హెడ్‌లైట్లు ఆన్‌ చేయడంతో ఆ వెలుతురులో విద్యార్థులు పరీక్ష పూర్తిచేశారు.

ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో రావడంతో ఇది వివాదాస్పదంగా మారింది. దీనిపై తూర్పు చంపారన్‌ జిల్లా కలెక్టర్‌ స్పందించారు. ఘటనపై దర్యాప్తు కోసం జిల్లా విద్యాధికారి నేతృత్వంలోని కమిటీని నియమించినట్లు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:ఆ హైకోర్టులకు 19 మంది కొత్త న్యాయమూర్తులు!

ABOUT THE AUTHOR

...view details