Bihar Assembly no confidence motion: బిహార్ శాసన సభ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై అవిశ్వాశ తీర్మానం ప్రవేశ పెడుతున్నారని రాజీనామా చేస్తే, తన ఆత్మ గౌరవం దెబ్బతింటుందని అన్నారు. తనపై అసత్య ఆరోపణలతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారని చెప్పారు. శాసన సభ నియమావళిని పట్టించుకోకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. ఈ అవిశ్వాస తీర్మానంలో అసెంబ్లీ నిబంధనలను తుంగలో తొక్కారని ఆరోపించారు. తాను పక్షపాత ధోరణితో, నియంతలా వ్యవహరిస్తున్నాని అసత్య ఆరోపణలు చేశారని అన్నారు. ఈ ఆరోపణల్లో నిజం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో రాజీనామా చేస్తే తన ఆత్మగౌరవం దెబ్బతింటుందని సిన్హా పేర్కొన్నారు.
నీతీశ్ కుమార్ ప్రభుత్వం బలాన్ని నిరూపించుకునేందుకు ఏర్పాటు చేసిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు ఒక్కరోజు ముందు ఈ వ్యాఖ్యలు చేశారు సిన్హా. అయితే, బలపరీక్ష సమయంలో భాజపా వైఖరి ఎలా ఉంటుందనే ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. తాను ఈ రాజ్యాంగపరమైన స్పీకర్ పదవి నిబంధనలకు కట్టుబడి.. బాధ్యతలను నిర్వహించడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని పేర్కొన్నారు.