Bihar Reservation Increase : బిహార్‌లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్ల కోటా పెంపునకు ఆ రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు 50 నుంచి 65 శాతానికి పెరిగాయి. రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును బిహార్ ప్రభుత్వం అసెంబ్లీలో గురువారం ప్రవేశపెట్టగా.. మూజువాణి ఓటుతో ఆమోదం లభించింది.
'బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్'
Bihar Special Status : మరోవైపు.. బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని అసెంబ్లీ వేదికగా కేంద్రాన్ని మరోసారి డిమాండ్ చేశారు సీఎం నీతీశ్ కుమార్. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి మరిన్ని మౌళిక వసతులు వస్తాయని తెలిపారు. ప్రత్యేక హోదా వల్ల బిహార్ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ కోటా పెంపు బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందడం పట్ల హర్షం వ్యక్తం చేసారు నీతీశ్ కుమార్. బిల్లుకు మద్దతు తెలిపిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు.
'కులగణన జరపాలని కేంద్రాన్ని ఇంతకముందే అడిగాం. కానీ కేంద్రం అందుకు అంగీకరించలేదు. అందుకే బిహార్‌లో కులగణన చేశాం. కులగణన ఆధారంగా రాష్ట్రంలో రిజర్వేషన్లు అమలు చేస్తాం.' అని బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ తెలిపారు.