తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నితీశ్‌ విధానాలతోనే అభివృద్ధి దూరం'

బిహార్​ అభివృద్ధి కుంటపడటానికి సీఎం నితీశ్​ కుమార్​ విధానాలే కారణమని ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్​ ఆరోపించారు. నీతి ఆయోగ్‌ సూచీలో బిహార్ అట్టడుగు స్థానంలో నిలవడంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.

By

Published : Jun 6, 2021, 7:08 AM IST

Lalu Yadav taunts Nitish Kumar
లాలూ ప్రసాద్‌ యాదవ్‌

బిహార్‌ అభివృద్ధికి దూరంగా ఉండటానికి ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ విధానాలే కారణమంటూ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఆరోపించారు. నీతి ఆయోగ్ ప్రకటించిన స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల సూచీ(ఎస్‌డీజీ) 2020-21లో బిహార్‌ అట్టడుగున నిలిచిన నేపథ్యంలో నితీశ్‌పై లాలూ తీవ్ర విమర్శలు గుప్పించారు. తాను సీఎంగా ఉన్నప్పుడు ప్రారంభించిన చాలా ఆరోగ్య కేంద్రాలను నీతీశ్‌ మూయించారని విమర్శించారు. పాఠశాల భవానాలను సైతం నిరుపయోగంగా మార్చారని దుయ్యబట్టారు. నీతి ఆయోగ్‌ రిపోర్టులో బిహార్‌ ఆఖరి స్థానంలో నిలవడానికి ఇలాంటి చర్యలే కారణమన్నారు. నితీశ్‌పై ప్రతిపక్ష నేత తేజస్వి ప్రసాద్‌ యాదవ్‌ సైతం మండిపడ్డారు. అభివృద్ధిలో బిహార్‌ ఆఖరి స్థానంలో నిలవడం వరుసగా ఇది మూడోసారంటూ ధ్వజమెత్తారు. నీతీశ్‌ 16 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి ఏమిటో నీతి ఆయోగ్‌ రిపోర్టు తెలియజేస్తోందంటూ ఎద్దేవా చేశారు.

లాలూ ప్రసాద్‌ యాదవ్‌, తేజస్వి విమర్శలపై జనతాదళ్‌(జేడీయూ)నేత, అధికార ప్రతినిధి రాజీవ్‌ రతన్‌ స్పందించారు. "లాలూ ప్రస్తుతం నీతి ఆయోగ్‌ రిపోర్టు గురించి మాట్లాడుతున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశ ప్రజలంతా బిహార్‌లో జరిగిన నేరాల గురించే మాట్లాడుకునేవారు. తాజా నివేదికను మేము అంగీకరిస్తున్నాం. బిహార్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఉన్నట్లయితే పరిస్థితి మరోలా ఉండేది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులకు ఆర్జేడీ, కాంగ్రెస్‌ పార్టీలే కారణం" అని పేర్కొన్నారు. రాజీవ్‌ రతన్‌ వ్యాఖ్యలను ఆర్జేడీ సీనియర్‌ నేత శివానంద్‌ తివారీ ఖండించారు. బిహార్‌ కంటే ఝార్ఖండ్‌ ర్యాంకు మెరుగ్గా ఉందని గుర్తు చేశారు. మరోవైపు.. లాలూ వ్యర్థ సూచనలు ఇస్తున్నారంటూ భాజపా అధికార ప్రతినిధి అజిత్‌ చౌదరి విమర్శించారు.

రాష్ట్రాలు సాధించిన సుస్థిరమైన అభివృద్ధికి సంబంధించి నీతి ఆయోగ్ గురువారం విడుదల చేసిన నివేదికలో కేరళ మొదటి స్థానాన్ని దక్కించుకోగా, బిహార్‌ ఆఖరి స్థానంలో నిలిచింది.

ఇదీ చూడండి:అభివృద్ధి ర్యాంకులో కేరళ మళ్లీ టాప్​

ABOUT THE AUTHOR

...view details