"కరోనా కారణంగా విద్యాసంస్థలు మూతబడ్డాయి. ఆన్‌లైన్ క్లాసులు జరిగినప్పటికీ హాజరైంది అరకొరా విద్యార్థులే. పాఠాలేమీ చెప్పలేకపోయాను" అంటూ తన 33 నెలల వేతనాన్ని తిరిగిచ్చేశారు ఓ కాలేజీ ప్రొఫెసర్. విద్యార్థులకు పాఠాలు బోధించకుండా జీతం తీసుకొనేందుకు తన మనస్సాక్షి అంగీకరించలేదంటూ దాదాపు రూ.24లక్షలను వెనక్కి ఇచ్చేశారు ప్రొఫెసర్ లలన్ కుమార్. అయితే, తాజాగా జరిగిన బదిలీల్లో ఆయన కోరిన విధంగా చేయలేదనే కారణంతోనే ఇలా చేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు.
బిహార్‌కు చెందిన 33 ఏళ్ల లలన్ కుమార్ ముజఫర్‌పుర్‌లోని ఓ ప్రభుత్వ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈయన దిల్లీలోని జవహార్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ నుంచి హిందీలో మాస్టర్స్, దిల్లీ యూనివర్శిటీ నుంచి పీహెచ్‌డీ, ఎంఫిల్ చేశారు. చదువు పూర్తయిన తర్వాత ముజఫర్‌పుర్‌లోని నితీశ్వర్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేశారు. ఇది బీఆర్ అంబేడ్కర్ బిహార్ యూనివర్శిటీ (బీఆర్‌ఏబీయూ) అనుబంధ కళాశాల. 2019 సెప్టెంబరులో లలన్ ఉద్యోగంలో చేరగా.. ఆ తర్వాత కొన్నాళ్లకే కరోనా వ్యాప్తి దృష్ట్యా లాక్‌డౌన్ రావడం వల్ల కాలేజీ మూతబడింది. ఆన్‌లైన్ క్లాసులు జరిగినప్పటికీ విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో లలన్ తన రెండేళ్ల తొమ్మిది నెలల వేతనాన్ని బీఆర్‌ఏబీయూ యూనివర్శిటీ రిజిస్ట్రార్‌కు మంగళవారం తిరిగిచ్చేశారు.
ఈ సందర్భంగా లలన్ మాట్లాడుతూ.. "ఈ కాలేజీలో చేరినప్పటి నుంచి ఒక్కరోజు కూడా పూర్తిగా పాఠాలు బోధించలేకపోయాను. పాఠాలు చెప్పనప్పుడు జీతం తీసుకొనేందుకు నా అంతరాత్మ అంగీకరించలేదు. అందుకే వేతనాన్ని తిరిగిచ్చేశా" అని తెలిపారు. ఈ 33 నెలలకు రూ.23,82,228 వేతనాన్ని తీసుకోగా.. ఆ మొత్తాన్ని లలన్ చెక్కు రూపంలో తిరిగిచ్చారు. అతడి చర్యను బీఆర్‌ఏబీయూ రిజిస్ట్రార్ అభినందించారు.