JDU BJP alliance breakup : అనుకున్నట్టే జరిగింది. నితీశ్ కుమార్ ఎత్తుగడతో బిహార్ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. మిత్రపక్షం భాజపాకు రెండోసారి షాక్ ఇచ్చింది జనతాదళ్ యునైటెడ్(జేడీయూ). జాతీయ ప్రజాస్వామ్య కూటమి నుంచి నిష్క్రమించింది. ఇప్పటివరకు ప్రత్యర్థులుగా ఉన్న రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ), కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాకూటమితో జట్టు కట్టింది. ఆ పార్టీలతో కలిసి సరికొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది నితీశ్ సేన. ఇందుకు అనుగుణంగా.. ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగారు నితీశ్ కుమార్. మంగళవారం పట్నాలో గవర్నర్ ఫాగూ చౌహాన్‌ను కలిసి రాజీనామా లేఖ అందజేశారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలందరి ఏకగ్రీవ సూచన మేరకు ఇలా చేసినట్లు.. గవర్నర్‌ను కలిసిన అనంతరం చెప్పారు నితీశ్.
నితీశ్ ప్రమాణస్వీకారానికి ముహుర్తం ఫిక్స్
భాజపాతో తెగదెంపులు చేసుకున్న జేడీయూ అధినేత నితీశ్ ఆర్జేడీ-లెఫ్ట్-కాంగ్రెస్ సారథ్యంలోని మహాఘట్‌బంధన్‌తో జట్టుకట్టారు. దీంతో బిహార్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. బుధవారం మధ్యాహ్నం 2గంటలకు బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది.
అంతకుముందు, రాజ్‌భవన్ నుంచి నేరుగా రబ్రీ దేవి నివాసానికి వెళ్లారు జేడీయూ అధినేత. తేజస్వీ యాదవ్ సహా ఇతర ఆర్జేడీ నేతల్ని కలిశారు. ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు చెప్పారు. "2017లో ఏం జరిగిందో మర్చిపోదాం. ఇప్పుడు సరికొత్త అధ్యాయం ప్రారంభిద్దాం" అని తేజస్వీ యాదవ్‌తో నితీశ్ అన్నట్లు తెలిసింది. తర్వాత కాసేపటికి.. నితీశ్, తేజస్వీ కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లారు. ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం కల్పించాలని కోరారు. తమకు సంఖ్యాబలం ఉందని చెబుతూ.. అందుకు సంబంధించిన పత్రాల్ని సమర్పించారు. స్వతంత్రులు, ఏడు పార్టీల సభ్యులు కలిపి.. తనకు మొత్తం 164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటించారు నితీశ్. మరోవైపు.. భాజపాపై తీవ్ర విమర్శలు గుప్పించారు తేజస్వీ. "హిందీ బెల్ట్‌లో భాజపాకు మిత్రపక్షం ఏదీ లేదు. పొత్తు పెట్టుకున్న ప్రతి పార్టీనీ భాజపా దెబ్బతీస్తుందని చరిత్ర చెబుతోంది. పంజాబ్, మహారాష్ట్రలోనూ అదే జరిగింది." అని అన్నారు ఆర్జేడీ నేత.
కావాలనే చేశారు..!
నితీశ్ రాజీనామా ప్రకటనకు ముందు.. హైఓల్టేజ్ రాజకీయానికి వేదికైంది బిహార్. ప్రధాన పార్టీలన్నీ విడివిడిగా సమావేశాలు నిర్వహించి.. భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించాయి. జేడీయూ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పట్నాలో భేటీ అయ్యారు నితీశ్. "ముందు చిరాగ్ పాసవాన్ తిరుగుబాటు, తర్వాత ఆర్సీపీ సింగ్ రూపంలో జేడీయూను బలహీనపరిచేందుకు భాజపా ప్రయత్నించింది. కూటమి నుంచి నేను వైదొలగాల్సిన పరిస్థితిని భాజపానే సృష్టించింది" అని పార్టీ నేతలకు నితీశ్ చెప్పినట్లు తెలిసింది. సానుకూలంగా స్పందించిన జేడీయూ ఎమ్మెల్యేలు, ఎంపీలు.. నితీశ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం.