Bihar Police Arrested Thief : 1990లో అనేక దొంగతనాలకు పాల్పడి పోలీసులకు దొరకకుండా తిరుగుతున్న బిహార్‌కు చెందిన ఓ గజదొంగను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. మూడు దశాబ్దాల తరువాత దొంగను అతడి ఇంట్లోనే అరెస్టు చేశారు. నిందితుడిపై గతంలో కోర్టులు.. రెడ్ వారెంట్ జారీ చేశాయి. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించమని బక్సర్ ఎస్పీ మనీశ్ కుమార్ పోలీసులకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై గజదొంగను అరెస్ట్ చేశారు.
బక్సర్ జిల్లాలోని కృష్ణబ్రహ్మ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉదియన్గంజ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి 1990లో అనేక దొంగతనాలు చేశాడు. అప్పటి నుంచి అతడు పోలీసులకు చిక్కకుండా పరారీలోనే ఉన్నాడు. పోలీసులు అతడి కోసం ముమ్మరంగా వెతికినా.. నిందితుడిని పట్టుకోలేకపోయారు. అయితే, పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించి, నేరస్థులను జైలుకు పంపాలని ఎస్పీ మనీశ్ కుమార్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే పరారీలో ఉన్న దొంగను పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలించారు. ఇంతలో ఆ దొంగ తన ఇంట్లోనే ఉన్నాడని పోలీసులకు సమాచారం అందింది. దీంతో కృష్ణబ్రహ్మ పోలీసులు దొంగ ఇంటికి వెళ్లి అతడిని అరెస్ట్ చేశారు. గజదొంగతో పాటు హత్య కేసులో నిందితుడిగా ఉన్న జితేంద్ర రామ్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. జితేంద్ర రామ్ కూడా చాలా కాలంగా పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నాడు.