ఓ వ్యక్తి బ్యాంకు ఖాతాలో పొరపాటున(money in bank account by mistake) రూ.5.5 లక్షలు డిపాజిట్ కాగా.. తనకు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చారని, ఖర్చు చేసినట్లు చెప్పిన సంఘటన జరిగిన రోజుల వ్యవధిలోనే.. అలాంటిదే మరొకటి వెలుగులోకి వచ్చింది. కానీ, ఈసారి ఏకంగా రూ.900 కోట్లు. ఇద్దరు పాఠశాల విద్యార్థుల ఖాతాల్లో జమయ్యాయి. అదీ బిహార్‌లోనే జరగటం గమనార్హం.
విద్యార్థుల ఖాతాల్లో కోట్లలో నగదు డిపాజిట్ కావటంపై వారి కుటుంబ సభ్యులే కాదు, మొత్తం గ్రామస్థులంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపైనే ఆ ప్రాంతంలో చర్చ జరుగుతోంది.
ఇదీ జరిగింది..!
కటిహార్ జిల్లా బగౌరా పంచాయతీ పరిధిలోని పస్తియా గ్రామానికి చెందిన విద్యార్థులు.. గురుచంద్ర విశ్వాస్, అసిత్ కుమార్‌లకు ఉత్తర్ బిహార్ గ్రామిణ్ బ్యాంకులో ఖాతాలు ఉన్నాయి. పాఠశాల యూనిఫామ్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నగదు తమ ఖాతాలో జమ అయ్యిందో లేదో అని తెలుసుకోవాలనుకున్నారు. సమీపంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన సెంట్రలైస్డ్ ప్రాసెసింగ్ సెంటర్‌కు వెళ్లి ఖాతాలోని బ్యాలెన్స్ చెక్ చేయించారు. అయితే.. తమ ఖాతాల్లో భారీగా నగదు ఉన్నట్లు తెలుసుకుని షాక్‌కు గురయ్యారు. విశ్వాస్ ఖాతాలో రూ.60 కోట్లు, కుమార్ ఖాతాలో రూ.900 కోట్లు జమయ్యాయి.
ఈ సంఘటనపై బ్రాంచ్ మేనేజర్ మనోజ్ గుప్తా ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే ఇద్దరి ఖాతాలను నిలిపివేశారు. దీనిపై పైఅధికారులకు సమాచారం అందించారు గుప్తా. ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
ఇదీ చూడండి:'నా ఖాతాలో ఆ డబ్బు మోదీనే జమచేశారు.. నేనివ్వను'