Bihar mini rajdoot: బిహార్‌లోని పట్నాకు చెందిన మెకానిక్ అద్భుతం చేశాడు. 39 ఏళ్ల క్రితం భారత్‌లో ఉత్పత్తిని నిలిపివేసిన రాజ్‌దూత్ వాహనాన్ని పనికిరాని వస్తువులతో రూపొందించాడు. తనకు ఉన్న పరిమిత వనరులతో ద్విచక్రవాహనాన్ని తయారు చేసి అందరి ప్రశంసలు పొందుతున్నాడు.
పట్నాలో 'మోహన్ బుల్లెట్' అనే బైక్ రిపేర్ షాప్‌ను నడిపిస్తున్న మహ్తాబ్.. రిషికపూర్ నటించిన అలనాటి బాబీ సినిమాను స్ఫూర్తిగా తీసుకొని ఈ బైక్‌ను తయారు చేశాడు. ఇందుకు మహ్తాబ్ తండ్రి కూడా సహకరించాడు. తండ్రి ప్రోత్సాహంతో.. మహ్తబ్ పాడైపోయిన బైక్‌ల విడిభాగాలను సేకరించి.. రెండు నెలల్లో రాజ్‌దూత్ వాహనాన్ని రూపొందించాడు. దీన్ని ఎనిమిదేళ్ల తన కొడుకుకు బహుమతిగా ఇచ్చాడు. అయితే, ఇప్పుడే తన కొడుకు నడపడం లేదని చెప్పాడు.
"పట్నాలో చిన్న బైక్‌లు కనిపించడం లేదు. అందుకే దీన్ని నా కుమారుడి కోసం తయారు చేశా. ఇప్పుడు నా కొడుకు చిన్నగా ఉన్నాడు. అందుకే దీన్ని అలాగే ఖాళీగా ఉంచా. ఇతర వాహనాలకు చెందిన విడిభాగాలతో దీన్ని రూపొందించా. ఇది 1985 మోడల్‌ను పోలిన బైక్. 40 కిలోల బరువు ఉంటుంది. ఎక్కడకు వెళ్లినా దీని గురించి అందరూ ప్రశ్నిస్తారు. ఇది ఎలా వచ్చింది. నాకు విక్రయిస్తారా అని అడుగుతారు. దిల్లీ నుంచి వచ్చి దీన్ని అమ్మాలని అడిగారు. కానీ నేను ఒప్పుకోలేదు."