Bihar Memory Man Abhay Kumar : సాధారణంగా గతవారం ఫలానా తేదీ ఏ రోజు వచ్చిందో చెప్పమంటేనే మనం ఫోన్లలో క్యాలెండర్‌ను తెరుస్తాం. అలాంటిది ఎటువంటి ఆధారం లేకుండా పది వేల సంవత్సరాలకు సంబంధించి 19 వేర్వేరు క్యాలెండర్ తేదీలు ఏ రోజు వచ్చాయో కేవలం ఒక్క నిమిషంలోనే చెప్పేశాడు బిహార్‌కు చెందిన అభయ్‌కుమార్. ఈ మేరకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నాడు.
వైశాలి జిల్లాలోని హాజీపుర్ ప్రాంతానికి అభయ్‌కుమార్(30) ఈ ఘనత సాధించాడు. తన పేరిట ఉన్న గిన్నిస్ రికార్డును తానే బద్దలకొట్టాడు. దీంతో అతడి అద్భుతమైన జ్ఞాపకశక్తికి ఆశ్యర్యపోతున్న పలు దేశాల మేధావులు అభయ్‌ను అభినందిస్తున్నారు. అభయ్ రెండో సారి గిన్నిస్ బుక్‌లో సాధించిన విషయాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ స్వయంగా తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ప్రకటించింది. అభయ్ తండ్రి సహేంద్ర పాశ్వాన్ వృత్తిరీత్యా ప్రొఫెసర్, తల్లి ప్రేమ్ షీలా కుమారి గృహిణి.
అభయ్‌కుమార్ ఇప్పటి వరకు మూడు గిన్నిస్ రికార్డులను నెలకొల్పాడు. తొలిసారి 1 నుంచి 10 వేల సంవత్సరాలకు చెందిన 16 క్యాలెండర్ తేదీల రోజులను కేవలం 1 నిమిషంలోనే చెప్పి రికార్డులోకెక్కాడు. ఆ తర్వాత ఒక్క నిమిషంలోనే 91 దేశాలకు చెందిన పాస్‌పోర్ట్‌లను గుర్తించి రెండో రికార్డును కైవసం చేసుకున్నాడు. పాస్‌పోర్ట్‌లపై ఉన్న చిహ్నాల ఆధారంగా 60 సెకన్లలో 91 దేశాలను గుర్తించగలిగాడు అభయ్. అంతకుముందు ఈ రికార్డు ఒక నిమిషంలో 87 దేశాల పేర్లు చెప్పిన దక్షిణ భారత్‌కు చెందిన వ్యక్తి పేరిట ఉండేది. తాజాగా మూడోసారి గిన్నిస్ రికార్డు సాధించాడు.
"2016లో నేను మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేశాను. అదే సంవత్సరం పాలిటెక్నిక్ కళాశాలలో లెక్చరర్‌గా చేరి 2020 వరకు పనిచేశాను. ఆ తర్వాత కొవిడ్ వచ్చింది. ఆ సమయంలో అందరం ఖాళీగా ఉన్నాం. అప్పుడే నేను నా జ్ఞాపకశక్తిని పెంచుకునేందుకు ప్రణాళికను తయారు చేసుకొని అమలు చేశాను. మనం అప్పుడప్పుడు కొన్ని విషయాలు మర్చిపోతుంటాం. అంతేకాకుండా నేను మా కాలేజీలో పాఠాలు చెప్పేటప్పుడు కూడా విద్యార్థులు చదువులో ఎందుకు వెనకబడతారని ఆలోచించాను. ఇందుకు కారణం ఏంటని చూస్తే మెమొరీ పవర్ లోపించడం అని గమనించాను. అందుకని దీనిని అధిగమించేందుకు పని చేద్దాం అని నిర్ణయించుకున్నాను. ఈ క్రమంలోనే 2021 నుంచి నా పనిని మొదలుపెట్టాను. ఈ సమయంలో చాలా రకాల జాతీయ, అంతర్జాతీయ పుస్తకాలు చదివాను. సోషల్ మీడియా సాయం తీసుకున్నాను"