22 years no shower: సెలవురోజు స్నానం చేయకుండా ఉండటం.. చాలా మంది చేసే పనే. అదే వారం రోజులు స్నానం చేయకపోతే.. ఒంటి నుంచి దుర్వాసన గుప్పుమంటుంది. చర్మ పాడవుతుంది. కానీ బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి మాత్రం 22ఏళ్ల నుంచి స్నానం చేయకుండా జీవిస్తున్నాడు. గోపాల్‌గంజ్ జిల్లా, బైకుంఠపుర్కు చెందిన ధరమ్‌దేవ్ రామ్.. 2000 సంవత్సరం నుంచి ఒక్కసారి కూడా స్నానం చేయలేదు. వింటే ఎంతో ఆశ్చర్యంగా ఉన్నా.. దీని వెనక ఉన్న కారణం తెలిస్తే ఆయన్ను మెచ్చుకోకుండా ఉండలేం.
మహిళల పట్ల జరుగుతున్న నేరాలకు వ్యతిరేకంగా ఆయన స్నానం చేయడం మానేశారు. వీటితో పాటు భూతగాదాలు, హత్యలు ఆగిపోయేంత వరకు స్నానం చేయబోనని ప్రతిజ్ఞ చేశారు. ప్రస్తుతం ఆయన వయసు 62 కాగా.. 40ఏళ్ల వయసులోనే స్నానాన్ని ఆపేశారు. జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తన ప్రతిజ్ఞకు కట్టుబడే ఉన్నారు ధరమ్‌దేవ్. భార్య, కుమారుడు మరణించిన సమయంలోనూ ఆయన స్నానం చేయలేదని స్థానికులు చెబుతున్నారు.
"1975లో బంగాల్లోని ఓ ఫ్యాక్టరీలో నేను పనిచేస్తుండేవాడిని. 1978లో నాకు వివాహం అయింది. 1987 సమయంలో మహిళలపై నేరాలు, భూతగాదాలు, జంతుబలులు, హత్యలు ఎక్కువైపోయాయని గ్రహించా. వీటికి పరిష్కారం కోసం ఓ 'గురువు' దగ్గరకు వెళ్లా. ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లాలని ఆయన నాకు సూచించారు. అప్పటి నుంచి భక్తి మార్గంలోనే వెళ్తున్నా. రాముడిని ప్రార్థిస్తూ జీవిస్తున్నా" అని ధరమ్‌దేవ్ ఈటీవీ భారత్‌కు వివరించారు. ఇన్నేళ్ల నుంచి స్నానం చేయకపోయినా ధరమ్‌దేవ్ ఆరోగ్యంగానే ఉండటం విశేషం. స్నానం చేయకపోవడం వల్ల ఎలాంటి జబ్బులు రాలేదని ఆయన చెబుతున్నారు.