బిహార్‌లో కల్తీమద్యం మరోమారు కలకలం రేపింది. సివాన్ జిల్లాలో కల్తీ మద్యం తాగి ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఏడుగురు అస్వస్థకు గురై ఆస్పత్రి పాలయ్యారు. శవపరీక్ష తర్వాతే మృతికి గల కారణాలు తెలుస్తాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 10 మందిని అరెస్టు చేశారు. సివాన్‌లోని నబీగంజ్‌లోని బాలా గ్రామానికి చెందిన జనక్ ప్రసాద్, నరేష్ బీన్ రాత్రి సమయంలో కడుపునొప్పి ప్రారంభమైంది. దాంతో పాటు వారి కంటి చూపు కూడా మందగించింది. దీంతో వారి బంధువులు సివాన్‌లోని సదర్ ఆస్పత్రికి తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు.. అప్పటికే మరణించినట్లు తెలిపారు. మృతులను నరేష్ బీన్, జనక్ ప్రసాద్, రమేష్ రావత్గా గుర్తించారు.
2016 ఏప్రిల్‌లో నీతీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం బిహార్‌లో మద్యం అమ్మకాలు, వినియోగంపై నిషేధం విధించారు. అయినప్పటికీ మద్యం విక్రయాలు ఆగడం లేదు. అనేకమంది అక్రమంగా విక్రయిస్తున్నారు. 2021 డిసెంబర్లో ఛప్రాలోని సరన్ జిల్లా నకిలీ మద్యం సేవించడం వల్ల 75 మందికి పైగా మరణించారు. ఈ ఘటన అసెంబ్లీలో రాజకీయ దుమారాన్ని రేపింది, నకిలీ మద్యం మరణాలపై బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై ప్రతిపక్ష నాయకులు బలమైన దాడికి దిగారు.
అయితే ఈ కల్తీ మద్యం విక్రయాలు సరన్‌లోని మష్రక్, మధుర, ఇసువాపుర్, అమ్నౌర్ ప్రాంతాలలో మాత్రమే జరిగాయి. ఇప్పుడు సివాన్‌లో కూడా వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. మానవ హక్కుల కమీషన్ కూడా ఈ విషయంపై దర్యాప్తు చేపట్టింది. గ్రామంలోనే కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నారని అధికారులు తెలిపారు. దాంతో పోలీసులు 10 మంది నిందితులను అరెస్టు చేశారు. దీనిలో అధికారులు పాత్ర కూడా ఉందని చెబుతున్నారు.