తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Bihar Hooch Tragedy: కల్తీ మద్యం కలకలం.. 22 మంది మృతి.. అనేక మందికి.. - బిహార్​లో కల్తీ మద్యం పలువురు మృతి

బిహార్​లో మరోసారి కల్తీ మద్యం కలకలం రేపింది. 24 గంటల వ్యవధిలో 22 మంది మృతిచెందారు. చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. వీరందరూ వివిధ అస్పత్రుల్లో చికిత్స పొందుతున్నందున.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని తెలుస్తోంది.

Bihar Hooch Tragedy
Bihar Hooch Tragedy

By

Published : Apr 15, 2023, 7:22 PM IST

బిహార్​లో మరోసారి కల్తీ మద్యం కలకలం సృష్టించింది. తూర్పు చంపారన్​ జిల్లా పరిధిలో శుక్రవారం సాయంత్రం నుంచి ఇప్పటివరకు 22 మంది అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. వీరందరూ వివిధ అస్పత్రుల్లో చికిత్స పొందుతున్నందున.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. కల్తీ మద్యం తాగడం వల్లే వీరంతా చనిపోయారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తుర్కౌలి పోలీస్ స్టేషన్​ పరిధిలో 11 మంది, హర్సిద్ధిలో ముగ్గురు, పహర్‌పూర్‌లో ముగ్గురు, సుగౌలీలో ఐదుగురు మరణించారని సమాచారం. అయితే, ఈ మరణాలను ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించలేదు.

గంటల వ్యవధిలో తండ్రి, కుమారుడు మృతి..
హర్సిద్ధి పోలీస్ స్టేషన్​ పరిధిలోని లోహియార్​లో కల్తీ మద్యం తాగడం వల్ల తండ్రీకుమారులు నాలుగు గంటల వ్యవధిలో మృత్యువాత పడ్డారు. మొదట తండ్రి నావల్​ దాస్​ మృతి చెందాడు. ఆ తర్వాత నాలుగు గంటలకు అతడి కుమారుడు పరమేంద్ర దాస్​ చనిపోయాడు. పోలీసుల భయంతో ఇద్దరికీ వెంటనే అంత్యక్రియలు నిర్వహించారని స్థానికులు ఆరోపించారు. ఆ తర్వాత నావల్​​ దాస్​ కోడలి పరిస్థితి విషమించింది. దీంతో ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం దర్యాప్తు చేసిన వైద్య బృందం.. నావల్​, పరమేంద్ర దాస్​ మృతికి డయేరియా కారణం అని చెప్పారు.

"ఇప్పటి వరకు ఏదీ ధ్రువీకరణ కాలేదు. దర్యాప్తు త్వరలో పూర్తవుతుంది. ఇద్దరిని ముజఫర్​పుర్​ ఆస్పత్రికి రిఫర్​ చేశాం. అస్వస్థతకు గురైన వాళ్లకు వాంతులు, డయేరియా లక్షణాలు ఉన్నాయి. దర్యాప్తు నివేదిక వచ్చిన తర్వాత అన్ని విషయాల గురించి స్పష్టత ఇస్తాం."
-అంజని కుమార్​, సివిల్​ సర్జన్

శుక్రవారం నుంచి కొనసాగుతున్న మరణాలు..
రామేశ్వర్​ అనే వ్యక్తి చనిపోవడం వల్ల.. అతడి కుటుంబ సభ్యులు ఓ క్లినిక్​ ముందు ఆందోళన చేపట్టారు. మరోవైపు లక్ష్మీపుర్​ గ్రామానికి చెందిన అశోక్​ పాశ్వాన్​ను మొదట సర్దార్​ ఆస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి ముజఫర్​పుర్​ ఆస్పత్రికి తరలింస్తుండగా.. మార్గమధ్యలో చనిపోయాడు. ఇక, ధృవ్ పాశ్వాన్​ అనే వ్యక్తి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. అయితే, అతడి మరణానికి కల్తీ మద్యం కారణమని వైద్యులు తెలిపారు. కానీ, అతడు మద్యం తాగలేదని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

కల్తీ మద్యం ఎఫెక్ట్​.. మసక బారుతున్న కళ్లు..
"గురువారం నేను మద్యం సేవించాను. అప్పటి నుంచి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంది. కళ్లు పూర్తిగా మసకగా కనిపిస్తున్నాయి." అని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రమోద్​ షా అనే బాధితుడు తెలిపాడు. "మా బావ రామమేశ్వర్​ ఉదయం నుంచి తీవ్ర తలనొప్పితో బాధపడున్నాడు. అతడికి చికిత్స అందించిన వైద్యుడు.. పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే మా బావ చనిపోయాడు. నాకు తెలిసినంతవరకు మా బావ మద్యం తాగలేదు. అతడికి ఏమైందో, ఎందుకు చనిపోయాడో అంతుపట్టడం లేదు" అని రామేశ్వర్​ బావమరిది పేర్కొన్నాడు. కాగా, ఈ ఘటనలపై జిల్లా మేజిస్ట్రేట్ దర్యాప్తునకు ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details