నెల క్రితం మృతిచెందిన ఓ వైద్యుడికి పదోన్నతి ఇస్తూ బిహార్ వైద్యఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆయన్ను వేరే చోటుకి బదిలీ చేస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొంది. ఈ ఘటన సోమవారం జరిగింది.
రోహతస్ జిల్లా బిక్రమ్‌గంజ్ సబ్ డివిజనల్ ఆస్పత్రి ఇంఛార్జిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ రామ్‌నారాయణ్ రామ్ ఫిబ్రవరి 7న మృతిచెందారు. అయితే ఆయన చనిపోయిన నెల రోజులకి ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ పదోన్నతి ప్రకటిస్తూ నోటీసులు పంపింది. షేక్‌పుర జిల్లా ఆస్పత్రి సివిల్ సర్జన్‌గా నియమిస్తున్నట్లు అందులో పేర్కొంది. దీనిపై వైద్యఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ సంతకం కూడా ఉంది.
ఈ విషయాన్ని రోహతస్ జిల్లా సివిల్ సర్జన్ డాక్టర్ సుధీర్ కుమార్ గమనించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. డాక్టర్ రామ్ ఫిబ్రవరి 7న మృతి చెందారని ధ్రువీకరించారు. ఆయన స్థానంలో ఇంకో వైద్యుడిని నియమించినట్లు స్పష్టం చేశారు.