Doctor kidnap force marriage: వెటర్నరీ డాక్టర్ను కిడ్నాప్ చేసి ఓ మహిళతో బలవంతంగా వివాహం జరిపించారు. బిహార్ బెగూసరాయ్ జిల్లాలోని పిధౌలీ గ్రామంలో ఈ ఘటన జరిగింది. పశువులకు జబ్బు చేసిందని చెప్పి వెటర్నరీ డాక్టర్ సత్యం కుమార్కు.. హసన్పుర్కు చెందిన విజయ్ సింగ్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. చికిత్స కోసం హసన్పుర్కు సత్యం వెళ్లాడు. ఈ క్రమంలోనే విజయ్.. సత్యంను కిడ్నాప్ చేశాడు. ఓ మహిళతో వివాహం జరిపించాడు. ఇప్పటికీ సత్యం జాడ దొరకలేదు. బాధితుడి తండ్రి సుబోధ్ కుమార్ ఝా ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముగ్గురిపై కేసు పెట్టారు. నిందితుల కోసం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదని బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇదిలా ఉండగా.. ఇందుకు సంబంధించి ఓ వీడియో బయటకు వచ్చింది. సత్యం ఓ మహిళతో వివాహం చేసుకుంటున్న వీడియో స్థానికంగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. పెళ్లి దుస్తుల్లో ఉన్న సత్యం.. ఓ మహిళ చెయ్యిలో చెయ్యి వేసి వేద మంత్రాల మధ్య వివాహం చేసుకుంటున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఇది నిజంగా బలవంతంగా జరిగిన పెళ్లేనా? లేదా ఇష్టంతోనే సత్యం వివాహం చేసుకున్నాడా అన్నది తేలాల్సి ఉంది. బాధితుడిని సంప్రదించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించినా ఫలితం లేదు.