Bihar fake police station: బిహార్ బాంకా జిల్లాలో నకిలీ పోలీసుల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఓ గెస్ట్ హౌస్‌ను పోలీస్ స్టేషన్‌గా మార్చి అక్రమాలకు పాల్పడుతున్న నకిలీ పోలీసులను అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి ఆయుధాలు, యూనిఫామ్స్, ఎఫ్ఐఆర్ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనురాగ్ అనే వ్యక్తికి చెందిన గెస్ట్ హౌస్‌ను పోలీస్ స్టేషన్‌గా మార్చి అక్రమాలకు పాల్పడుతున్నారు. వీరిని అరెస్ట్ చేసి విచారించగా.. తామంతా రోజువారీ కూలీకి పనిచేస్తున్నామని చెప్పారు. అనితా దేవి అనే మహిళ ఈ పోలీసు బృందాన్ని నడుపుతోంది. ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తనను ఇన్స్పెక్టర్గా నియమించారని అనితా చెప్పింది.
నిందితులను లోధియా గ్రామానికి చెందిన రమేశ్‌కుమార్, సుల్తాన్‌గంజ్ జిల్లా ఖాన్‌పుర్‌కు చెందిన జులీ కుమార్, భగల్పుర్కు చెందిన ఆకాశ్ కుమార్‌గా గుర్తించారు. తామంతా సీనియర్ పోలీస్ అధికారి భోలా యాదవ్ సారథ్యంలో పని చేస్తున్నామని నిందితులు తెలిపారు. వీరంతా పోలీసుల పేరు చెప్పి పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడ్డారు. ప్రజలు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు రాగా.. వారి వద్ద నుంచి భారీగా డబ్బులను సేకరించారు. అనంతరం వారి మధ్య రాజీ కుదిర్చి పంపించేవారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే ప్రధాన నిందితుడిని పట్టుకుంటామని డీసీపీ శ్రీవాస్తవ తెలిపారు. పోలీసుల కనుసన్నలోనే జరుగుతున్నా పట్టించుకోవట్లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.