కరోనా వ్యాప్తి దృష్ట్యా బిహార్లో ప్రస్తుతం విధించిన లాక్డౌన్ను జూన్ 8 వరకు పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వెల్లడించారు. అయితే వ్యాపారులు.. కార్యకలాపాలు నిర్వహించేందుకు కొన్ని సడలింపులు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఉత్తరాఖండ్లో పొడిగింపు..
ఉత్తరాఖండ్లో ప్రస్తుతం కొనసాగుతున్న కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి సుబోధ్ ఉనియల్ ప్రకటించారు. జూన్ 9 ఉదయం 6 గంటల వరకు ఈ కర్ఫ్యూ కొనసాగనుందని తెలిపారు. జూన్ 1 నుంచి జూన్ 7 వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిత్యావసర సరకులు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.
ఉత్తర్ప్రదేశ్లో సడలింపు
ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని 61 జిల్లాల్లో ఆంక్షలను సడలించింది. ఆదివారం 55 జిల్లాల్లో సడలింపులు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం సోమవారం మరో ఆరు జిల్లాల్లోనూ మినహాయింపులు ఇస్తున్నట్లు ప్రకటించింది. మిగతా 14 జిల్లాల్లో కొవిడ్ ఉద్ధృతి తగ్గనందున ఆంక్షలు కొనసాగుతాయని తెలిపింది.
జూన్ 1 నుంచి ఈ సడలింపులు అమలులోకి వస్తాయని యూపీ ప్రభుత్వం తెలిపింది. అయితే రాత్రి 7 నుంచి ఉదయం 7 వరకు ఉండే కర్ఫ్యూ యాథావిధిగా కొనసాగుతుందని.. వారాంతంలో రెండు రోజులు కర్ఫ్యూ పూర్తిస్థాయిలో అమలులో ఉంటుందని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి :దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలివే..