Bihar Encounter News : బిహార్.. తూర్పు చంపారణ్ జిల్లాలోని మోతిహారీలో బందిపోటు దొంగలకు, పోలీసులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు బందిపోటు దొంగలు హతమయ్యారు. ఘోరసహన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పురన్హియా గ్రామ సమీపంలో ఈ ఎన్‌కౌంటర్ ఆదివారం రాత్రి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు కూడా గాయపడ్డారు.
Shooting Between Police And Robbers : భారీ ఎత్తున దోపిడీకి పాల్పడేందుకు 25 నుంచి 30 మంది బందిపోటు దొంగలు గుమిగూడగా.. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులపై దొంగలు 12 రౌండ్ల కాల్పులు జరిపారు. కొన్ని బాంబులు విసిరారు. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు దొంగలు హతమయ్యారు. మిగిలిన వారు పరారయ్యారు. ఘటనాస్థలిలో బాంబులు, పిస్టల్, గ్యాస్ సిలిండర్, గ్యాస్ కట్టర్ వంటివి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ పోలీసులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పారిపోయిన దొంగల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. స్థానిక పోలీస్ స్టేషన్‌కు బందిపోటు దొంగల ఫొటోలను పంపారు. నేపాల్ సరిహద్దుల్లో ఈ ఘటన జరిగినందున ఆ దేశ పోలీసులకు కూడా సమాచారం అందించారు.
"తూర్పు చంపారణ్ జిల్లాలోని మోతిహారీలో పోలీసులు, బందిపోటు దొంగలు మధ్య ఆదివారం రాత్రి కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు దొంగలు మరణించగా.. ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. గాయాలపాలైన పోలీసులను దగ్గర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నాం. ఎన్కౌంటర్లో హతమైన బందీపోటు దొంగల మృతదేహాలను పోస్టుమార్టం పరీక్ష కోసం ఆస్పత్రికి తరలించాం. బాంబు స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ నిపుణులను ఘటనాస్థలికి రప్పించాం."