తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాంగ్రెస్​ కూటమిలోనే నీతీశ్​, తేజస్వి.. కేసీఆర్​, మమత దారెటు?

కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీతో బిహార్​ సీఎం నీతీశ్​ కుమార్, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్​ భేటీ అయ్యారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఐక్యత గురించి చర్చించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గద్దే దించడమే లక్ష్యంగా ప్రతిజ్ఞ చేశారు.

By

Published : Apr 12, 2023, 4:29 PM IST

opposition parties unity
opposition parties unity

జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం! బిహార్​ ముఖ్యమంత్రి నీతీశ్​ కుమార్​, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్​.. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. మంగళవారం దిల్లీ చేరుకున్న సీఎం నీతీశ్‌ కుమార్‌.. తేజస్వితో కలిసి మల్లికార్జున్‌ ఖర్గే నివాసానికి బుధవారం వెళ్లారు. అక్కడకు వచ్చిన రాహుల్‌ గాంధీ సమక్షంలో వారంతా కలిసి.. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఐక్యంగా పని చేయడంపై చర్చించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గద్దే దించేందుకు ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకువెళ్లాలని ప్రతిజ్ఞ చేశారు.

ఇదొక చారిత్రక సమావేశమని, రానున్న ఎన్నికల్లో అన్ని పార్టీలు ఏకమై పోరాడాలని నిర్ణయించుకున్నట్లు కాంగ్రెస్​ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. సమవేశానికి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు. "రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాము.. ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తాము. రాహుల్ సమక్షంలో బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్​ కుమార్​, ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్​తో భేటీ జరిగింది. దేశానికి దిశానిర్దేశం చేయాలని సంకల్పించాం" అని ఖర్గే ట్వీట్ చేశారు.

"ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు ఇదో చారిత్రక అడుగు. ప్రతిపక్ష పార్టీల దార్శనికతను పెంపొందించుకుని ముందుకు సాగుతాం. దేశం కోసం అందరం కలిసి కట్టుగా ప్రయత్నిస్తాం" అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. బీజేపీని గద్దే దించేందుకు మరిన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తున్నామని బిహార్​ సీఎం నీతీశ్​ కుమార్​ చెప్పారు.

నీతీశ్​ కుమార్​కు స్వాగతం పలుకుతున్న ఖర్గే
రాహుల్​, ఖర్గే, నీతీశ్​, తేజస్వి భేటీ

కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే.. బీజేపీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే ప్రతిపక్ష పార్టీల మధ్య ఐక్యతను పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల పలువురు నేతలతో ఆయన మాట్లాడారు. డీఎంకే చీఫ్‌, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేను సంప్రదించారు. రాబోయే రోజుల్లో ప్రతిపక్ష పార్టీలకు చెందిన అగ్ర నాయకులతో మల్లికార్జున ఖర్గే సమావేశం కానున్నారు! కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓడించే లక్ష్యంగా.. వారితో చర్చలు జరపనున్నారు.

ఖర్గే, నీతీశ్​, తేజస్వి, రాహుల్​ తదితరులు

గతేడాది ఆగస్టు​ నెలలో నీతీశ్‌ కుమార్‌ ఎన్డీఏతో తెగదెంపులు చేసుకోవడం వల్ల.. బిహార్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. భాజపా-జేడీయూ సంకీర్ణ ప్రభుత్వంలో సీఎంగా కొనసాగిన నీతీశ్‌.. తన పదవికి రాజీనామా చేసి ఆర్జేడీ-కాంగ్రెస్‌-వామపక్షాల సారథ్యంలోని మహాకూటమితో చేతుల కలిపి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ పరిణామాల మధ్య నీతీశ్‌ ఎనిమిదోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయగా.. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ రెండోసారి డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు.

ABOUT THE AUTHOR

...view details