తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రాష్ట్రపతి రేసులో లేను.. చరిత్రను ఎలా మారుస్తారు'

రాష్ట్రపతి రేసులో తాను లేనని బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నీతీశ్‌ కుమార్‌ స్పష్టంచేశారు. జులైలో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల బరిలో నీతీశ్‌​ ఉన్నారంటూ వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో ఆయన ఈ మేరకు సమాధానం ఇచ్చారు.

By

Published : Jun 14, 2022, 4:36 AM IST

Updated : Jun 14, 2022, 6:58 AM IST

Nithesh kumar on Presidential Election
Nithesh kumar on Presidential Election

Nithish Kumar on Presidential Election: రాష్ట్రపతి ఎన్నికల బరిలో తాను లేనని బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నీతీశ్‌ కుమార్‌ స్పష్టంచేశారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీ కాలం త్వరలో ముగియనుండటంతో జులైలో జరగబోయే ఎన్నికల బరిలో నీతీశ్‌ ఉన్నారంటూ వస్తున్న ఊహాగానాలకు ఆయన చెక్‌ పెట్టారు. పట్నాలో ప్రతివారం ప్రజలతో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమం సందర్భంగా వచ్చిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు.

‘దేశ తదుపరి రాష్ట్రపతి రేసులో నేను లేను. నేనెక్కడికీ వెళ్లడంలేదు. అలా వస్తున్న వార్తలన్నీ నిరాధారమైనవి. ఊహాగానాలు మాత్రమే’ అని నీతీశ్​ కుమార్​ తేల్చి చెప్పారు. ఈ నెల 9న రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కాగానే.. బిహార్‌ గ్రామీణాభివృద్ధి మంత్రి శ్రవణ్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలను నీతీశ్‌ కొట్టిపారేశారు. రాష్ట్రపతి కావడానికి కావాల్సిన అన్ని సామర్థ్యాలూ నితీశ్‌కు ఉన్నాయని.. ఓ బిహారీగా నీతీశ్‌ దేశ ప్రథమ పౌరుడు కావాలని తాను కోరుకుంటున్నానని.. ఆయన రేసులో లేనప్పటికీ ప్రతి వ్యక్తీ నీతీశ్‌ రాష్ట్రపతి కావాలనుకుంటారని మంత్రి వ్యాఖ్యానించారు. దీనిపై నీతీశ్‌ను ప్రశ్నించగా 'మళ్లీ చెబుతున్నా.. నేను రాష్ట్రపతి రేసులో లేను' అని ఆయన సమాధానం ఇచ్చారు.

చరిత్రను ఎలా మారుస్తారు?: నేటి తరం కోసం గత చరిత్ర వైభవాన్ని తిరగరాయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ స్పందించారు. చరిత్రను మార్చి రాయడం ఎలా సాధ్యమవుతుందని ఆయన మండిపడ్డారు. అసలు చరిత్రను ఎవరైనా ఎలా మారుస్తారు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొగలుల గురించి కాదు.. పాండ్యులు, చోళుల చరిత్ర గురించి రాయాలని అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై ఏమనుకుంటున్నారని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.

దీనిపై నితీశ్‌ స్పందిస్తూ.. 'అసలు చరిత్ర అంటే ఏమిటి? దాన్నెలా మారుస్తారు?' అని ప్రశ్నించారు. 'గత చరిత్రను ఎవరూ మార్చలేరు. అదెలా సాధ్యం. నాకైతే అర్థం కావట్లేదు. చరిత్ర అంటే చరిత్రే. దానిలో మార్పులుండవు'' అని చెప్పుకొచ్చారు. ఇటీవల ఓ పుస్తకావిష్కరణ సందర్భంగా భారత్‌లో చరిత్రకారులు మొగల్‌ పాలకుల చరిత్రను లిఖించడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని అమిత్‌ షా పేర్కొన్నారు. 'మన చరిత్రను రాయకుండా ఇప్పుడూ ఎవరూ ఆపలేరు. మనం స్వతంత్రులం' అని నొక్కి చెప్పారు. ఈ వ్యాఖ్యలపై నితీశ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'భాష అనేది వేరే సమస్య. ఒక పుస్తకాన్ని ఇతర భాషలోకి అనువదించుకోవచ్చు. కానీ, గత చరిత్ర అలా కాదు. దాన్ని ఎవరూ ఎప్పటికీ మార్చలేరు' అంటూ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:'మహా'లో 10రోజుల్లోనే 241% కేసుల పెరుగుదల.. రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక

Last Updated : Jun 14, 2022, 6:58 AM IST

ABOUT THE AUTHOR

...view details