బిహార్ సీఎంగా నీతీశ్ కుమార్, డిప్యూటీ సీఎంగా తేజస్వీ యాదవ్ ప్రమాణస్వీకారం Bihar New Goverment: ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ సహా ఏడు పార్టీలతో కూడిన మహాకూటమి ప్రభుత్వం బిహార్‌లో కొలువుదీరింది. భాజపాతో తెగదెంపులు చేసుకున్న జేడీయూ అధినేత నీతీశ్ కుమార్ రికార్డు స్థాయిలో ఎనిమిదో సారి బిహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ ఫాగు చౌహన్.. నీతీశ్‌తో ప్రమాణం చేయించారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రస్తుతానికి సీఎం, డిప్యూటీ సీఎంల ప్రమాణ స్వీకారం మాత్రమే జరగ్గా మహాకూటమిలో పార్టీలతో చర్చించిన తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు.
ప్రమాణ స్వీకారం చేస్తున్న నీతీశ్ కుమార్ Nitish Kumar Oath Ceremony: ఈ కార్యక్రమానికి తేజస్వీ సతీమణి రాజశ్రీ, తల్లి రబ్డీ దేవి, సోదరుడు తేజ్ ప్రతాప్ తదితరులు హాజరయ్యారు. ప్రమాణస్వీకారానికి ముందు ఆర్జేడీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌తో నీతీశ్ ఫోన్లో మాట్లాడారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులను ఆయనకు వివరించారు. నీతీశ్ నిర్ణయాన్ని లాలూ సమర్థించి.. ఆయనను అభినందించినట్లు ఆర్జేడీ వర్గాలు వెల్లడించాయి.
'నేను ప్రధాని పదవి రేసులో లేను'
మహాకూటమి ప్రభుత్వం భేషుగ్గా ఉంటుందని బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్ చెప్పారు. సంకీర్ణ కూటమి ఎక్కువ రోజులు ఉండదంటున్న భాజపా నేతల వ్యాఖ్యల్ని ఆయన కొట్టిపారేశారు. తాను సంకీర్ణ కూటమిలో కొనసాగుతానో లేదో వాళ్లు చెప్పుకునేది చెప్పుకోనివ్వండని అన్నారు. ప్రధాని మోదీపైనా విమర్శలు గుప్పించారు. 2014లో విజయం సాధించిన వ్యక్తి 2024లో గెలుస్తారా అని ప్రశ్నించారు. ప్రధాని పదవికి రేసులో తానులేనని స్పష్టంచేశారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ప్రతిపక్షాలను ఐక్యం చేసేందుకు ప్రయత్నిస్తానని ఆయన చెప్పారు.
ఇదొక శుభ పరిణామం: తేజస్వీ కుటుంబం
ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ కుటుంబం స్పందించింది. తేజస్వీ భార్య రాజశ్రీ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇదొక శుభ పరిణామమని, ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారని తేజస్వీ తల్లి రబ్డీ దేవి అన్నారు. ప్రజల కోసం పని చేసేందుకు అధికారంలోకి వచ్చామని ఆయన సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తెలిపారు.
ప్రమాణ స్వీకారం చేస్తున్న తేజస్వీ యాదవ్ 'పదవీ కాలం పూర్తికాకుండానే పతనం'
బిహార్‌లో నూతన సీఎంగా ప్రమాణం చేసిన నీతీశ్ కుమార్.. భవిష్యత్తులో ఆర్జేడీ పార్టీని విభజించడానికి ప్రయత్నిస్తారని భాజపా నేత సుశీల్ మోదీ ఆరోపించారు. పదవీ కాలం పూర్తికాకుండానే నీతీశ్ కుమార్ సంకీర్ణ ప్రభుత్వం పతనమైపోతుందని ఆయన జోస్యం చెప్పారు. బిహార్ ప్రజలను నీతీశ్ మోసం చేశారంటూ విమర్శలు గుప్పించారు.
స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం
ప్రస్తుత బిహార్ అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హాపై నీతీశ్ కుమార్- తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని మహాఘట్బంధన్ నేతలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. మహాఘట్బంధన్కు సంబంధించిన 50 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను బుధవారం బిహార్ విధానసభ కార్యదర్శికి సమర్పించారు. దీంతో విజయ్ కుమార్ సిన్హా.. తన స్పీకర్ పదవిని నిలబెట్టుకోవాలంటే అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తగిన సంఖ్యాబలం లేకపోతే ఆ పదవి నుంచి తప్పుకుని రాజీనామా చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం భాజపాకు 77 మంది ఎమ్మెల్యేలు ఉండగా, స్పీకర్ పదవిలో సిన్హా నిలదొక్కుకోవడానికి ఈ సంఖ్య సరిపోదు.
అనూహ్య మలుపులతో..
భాజపా అధినాయకత్వంపై కొన్నాళ్లుగా ఆగ్రహంతో ఉన్న నీతీశ్ కుమార్.. ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏతో తెగదెంపులు చేసుకున్నారు. ఆ కూటమి నుంచి బయటకు వచ్చి మంగళవారం సీఎం పదవికి రాజీనామా చేశారు. ఇది జరిగిన కాసేపటికే మహాకూటమితో పూర్వ సంబంధాలను పునరుద్ధరించుకున్నారు. ప్రత్యర్థి ఆర్జేడీ పార్టీతో మళ్లీ చేతులు కలిపారు. 7 పార్టీలతో కూడిన మహా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశమివ్వాలంటూ గవర్నర్‌ను కోరారు. అందుకు ఆయన ఆమోదించడం వల్ల బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.
లాలూ, నితీశ్ (పాత చిత్రం) ఆర్జేడీ నేతకు స్పీకర్ పదవి?
పొత్తులో భాగంగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌కు ఉపముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించారు. ఆర్జేడీ నుంచి మరో నేతకు స్పీకర్ పదవి దక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇక, మరో మిత్రపక్షమైన కాంగ్రెస్‌కు నాలుగు మంత్రి పదవులు ఇవ్వనున్నట్లు సమాచారం. 2015లో ఆర్జేడీ-జేడీయూ-కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ నీతీశ్ సీఎంగా ఉండగా.. తేజస్వీ యాదవ్ ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. లాలూ మరో తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌కు అప్పుడు మంత్రి పదవి దక్కగా.. కొత్త ప్రభుత్వంలోనూ మరోసారి మంత్రిత్వ శాఖలను అప్పగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: