కులగణనకు వెళ్లిన అధికారులకు.. ఓ రెడ్ లైట్ ఏరియాలో నివాసం ఉండే మహిళలు చెప్పిన సమాధానాలు ఆశ్చర్యానికి గురిచేశాయి. దాదాపు 40 మంది మహిళలు.. తమ భర్తగా ఒక్కరి పేరే చెప్పారు. దీంతో అక్కడికి వెళ్లిన అధికారులంతా అవాక్కయ్యారు. చాలా మంది పిల్లలు కూడా తమ తండ్రిగా.. అతని పేరే చెప్పారు. బిహార్‌లో చేపట్టిన కులగణన కార్యక్రమంలో భాగంగా.. వివరాల కోసం వెళ్లిన అధికారులకు ఈ వింత అనుభవం ఎదురైంది.
బిహార్‌లో ప్రస్తుతం రెండో దశ కులగణన జరుగుతోంది. అందులో భాగంగా కులం, విద్య, ఆర్థిక స్థితి, కుటుంబ స్థితిగతులు వంటి విషయాలు తెలుసుకునేందుకు.. అధికారులు ఇంటింటికి తిరిగి వివరాలు సేకరిస్తున్నారు. మొత్తం 17 రకాల ప్రశ్నావళిని రూపొందించి.. ప్రజల నుంచి వివరాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే.. అర్వల్ జిల్లాలోని ఓ రెడ్‌లైట్ ఏరియాకు అధికారులు వెళ్లారు. అక్కడ వివరాలు సేకరిస్తుండగా.. దాదాపు 40 కుటుంబాలు తమ భర్త కాలమ్‌లో రూప్‌చంద్ అనే పేరు నమోదు చేసుకున్నాయి. వారంతా కలిసి ఒకే పేరు చెప్పడం వల్ల అనుమానం వ్యక్తం చేసిన అధికారులు.. పూర్తి వివరాలను ఆరా తీశారు. దీంతో అసలు విషయం బయటపడింది.