బిహార్ అసెంబ్లీలో మంగళవారం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. బిహార్ ప్రత్యేక సాయుధ పోలీస్ బిల్-2021కి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు శాసనసభలో చేసిన ఆందోళనలు ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. వారెంట్ లేకుండా అరెస్టు, కస్టడీ మరణాలు లాంటి విషయాల్లో పోలీసులకు కొత్త బిల్లు విచ్చలవిడి స్వేచ్ఛ, శిక్ష నుంచి మినహాయింపు కల్పిస్తుందని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
ప్రతిపక్షాల ఆందోళనలతో సభ పలుమార్లు వాయిదాపడింది. తొలుత చర్చ ప్రారంభంకాగానే ఆర్జేడీ, సీపీఐ-ఎంఎల్, కాంగ్రెస్ నేతలు బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బిల్లును నల్ల చట్టంగా పేర్కొంటూ ప్రతులను చించేశారు. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ విమర్శించారు.
సభ్యులను స్పీకర్ ఎంత శాంతింపజేసినా నిరసనలు ఆగలేదు. దీంతో సభను వాయిదా వేశారు. అయితే సభ్యులను అదుపుచేసే క్రమంలో అసెంబ్లీ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భద్రతా సిబ్బంది తమపై దాడి చేశారని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు.