Bihar assembly floor test : భాజపా బంధానికి స్వస్తి పలికి కొత్త కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నీతీశ్ కుమార్ బలనిరూపణలో విజయం సాధించారు. ఈనెల 10న ఆర్జేడీ, కాంగ్రెస్ సహా పలుపార్టీలతో కలిసి మహాగట్ బంధన్ ప్రభుత్వం అధికారాన్ని దక్కించుకోగా.. ముఖ్యమంత్రిగా నీతీశ్ కుమార్, ఉపముఖ్యమంత్రిగా తేజస్వీ యాదవ్ ప్రమాణం చేశారు. అనంతరం ఇవాళ నిర్వహించిన బలపరీక్షలో నెగ్గి నీతీశ్ తన పదవిని కాపాడుకున్నారు. పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి విజయ్‌కుమార్ చౌదరి విజ్ఞప్తి మేరకు ఉపసభాపతి మహేశ్వర్ హజారీ ప్రత్యక్ష ఓటింగ్ నిర్వహించారు. 243మంది సభ్యులుగల బిహార్ శాసనసభలో 160 ఓట్లతో నీతీశ్ సర్కార్ విజయం సాధించారు. బలపరీక్ష అనంతరం సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ఉపసభాపతి తెలిపారు. ఖాళీ అయిన స్పీకర్ స్థానానికి గురువారం నామినేషన్లు తీసుకోనునన్నట్లు పేర్కొన్నారు.
సభలో ప్రసంగించిన నీతీశ్.. ఎల్జేపీ నేత చిరాగ్ పాస్‌వాన్ తిరుగుబాటును పరోక్షంగా ప్రస్తావించారు. భాజపా ఆదేశాలతో ఆర్సీపీ సింగ్.. జేడీయూలో చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రధాని పదవి కోసమే మహాగట్ బంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారన్న భాజపా ఆరోపణలను ఖండించిన నీతీశ్.. తనకు వ్యక్తిగత ఆశయాలు లేవని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ 2024 లోక్‌సభ ఎన్నికలకు ఐక్యం కావాలని దేశంలోని అన్నిపార్టీల నేతలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో భాజపాతో తన పాత బంధాన్ని గుర్తుచేసుకున్న నీతీశ్.. వాజ్‌పేయి, అడ్వాణీ, మురళీమనోహర్ జోషికి.. ప్రస్తుత కమలదళం అధినాయకత్వానికి ఉన్న తేడాను నొక్కిచెప్పారు. ప్రస్తుత పాలనలో ప్రచారం తప్ప పాలన చాలా తక్కువ అని ప్రధాని పేరు ప్రస్తావించకుండా నీతీశ్ వ్యాఖ్యానించారు.