అన్ని దేశాల ప్రజలు వ్యాక్సిన్ పొందేలా చూడటమే 2021లో అతిపెద్ద సవాల్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ పీటర్ సింగర్ అన్నారు. ప్రస్తుతం.. ధనిక దేశాలకే టీకా అందుబాటులో ఉందని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ డాక్టర్ టెడ్రోస్ అథనోమ్ అభిప్రాయపడిన నేపథ్యంలో ఈ విధంగా స్పందించారు సింగర్.
కేరళ ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిర్వహించిన 'కేరళ హెల్త్: మేకింగ్ ద ఎస్డీజీ ఎ రియాలిటీ' అంతర్జాతీయ సమావేశానికి వర్చువల్గా హాజరయ్యారు సింగర్. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. ప్రస్తుతం మహమ్మారిని జయించడమే ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఆపై.. ఐక్యరాజ్యసమితి ఇతర లక్ష్యాలైన పేదరికం, ఆకలి, నిరక్షరాస్యత, లింగ అసమానతతో సహా.. వాయు కాలుష్యం వంటి వాటిని అధిగమించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు.