Big Round Stones Found As Dinosaur Eggs : తరతరాలుగా పూజలు అందుకుంటున్న గుండ్రటి ఆకారంలోని రాళ్లను అంతరించిపోయిన డైనోసార్ గుడ్లుగా తేల్చారు లఖ్‌నవూలోని బీర్బల్ సాహ్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలియోసైన్సెస్కు చెందిన శాస్త్రవేత్తలు. దీంతో కొన్నేళ్లుగా వాటినే వంశదేవతలుగా కొలుచుకుంటున్న ఆ గ్రామ ప్రజలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ ధార్ జిల్లా నర్మదా వ్యాలీ ప్రాంతంలోని పడ్లియా గ్రామంలో జరిగింది. కాగా, ఈ ప్రాంతంలో లక్షల ఏళ్ల క్రితం డైనోసార్లు మనుగడ సాగించేవని, సుమారు 65 మిలియన్ల సంవత్సరాల క్రితం ఇక్కడ డైనోసార్లు తిరిగాయని స్థానికులు చెబుతున్నారు.
గత కొన్నేళ్లుగా
నర్మదా వ్యాలీ ప్రాంతంలో డైనోసార్ గుడ్లను కనుగొనడం ఇదేమీ తొలిసారి కాదు. కొన్ని సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు వందల సంఖ్యలో డైనోసార్ గుడ్లను ఇక్కడ స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు గ్రామస్థులు తమ పొలాల్లో ఈ గుండ్రటి రాళ్ల(డైనోసార్ గుడ్లు)ను పెట్టి పూజిస్తారు. ఈ ఆచారం గత కొన్ని శతాబ్దాలుగా పాటిస్తున్నామని, వాటిని తమ వంశదేవతగా భావించి ప్రార్థిస్తామని చెబుతున్నారు. ఇక తాజాగా అవి(రాళ్లు) డైనోసార్ గుడ్లని తెలిసిన వెంటనే అధికారులు రంగంలోకి దిగారు.
"గుండ్రంగా ఉన్న ఈ రాళ్లను 'కాకర్' అంటే 'పొలాల భైరవుడి'గా పూజిస్తాము. ఊర్లోని అందరూ తమ తమ ఇళ్ల దగ్గర, పొలాల్లో ఈ సంప్రదాయాన్ని పాటిస్తారు. మా పూర్వీకుల కాలం నుంచి దీనిని అనుసరిస్తున్నాము. ఇలా చేస్తే మా వ్యవసాయం, పాడిపశువులు బాగా వృద్ధి చెందుతాయి. వారి(వంశదేవతలు-గుండ్రటి రాళ్లు) అనుగ్రహం మాపై ఉంటుంది. అంతే కాకుండా విపత్కర పరిస్థితుల్లో మమ్మల్ని కాపాడతారని మా నమ్మకం."
- వేస్తా మాండ్లోయ్, గ్రామస్థుడు