తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​-అమెరికా బంధానికి 'హక్కుల' చిక్కులు! - human right violations

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికా మధ్య సంబంధాలు మరింత బలహీనమయ్యే సూచనలు కన్పిస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. గిరిజన హక్కుల ఉద్యమకారుడు స్టాన్​ స్వామి మృతిపై అంతర్జాతీయంగా విమర్శలు రావడం మంచిది కాదని చెబుతున్నారు. భారత్​లో మానవ హక్కుల ఉల్లంఘనల విషయాన్ని గతంలోనూ అమెరికా పలుమార్లు ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

Big 'Rights' bump up ahead in Indo-US ties
భారత్​-అమెరికా బంధానికి 'హక్కుల' చిక్కులు!

By

Published : Jul 7, 2021, 1:33 PM IST

అగ్రరాజ్యం అమెరికా, భారత్ మధ్య సంబంధాలు అంతమాత్రంగానే ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో గిరిజన హక్కుల ఉద్యమకారుడు ఫాదర్ స్టాన్ స్వామి పోలీసుల కస్టడీలో మరణించి ఉండకూడదని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. భారత్​లో మానవహక్కుల ఉల్లంఘనలు, సీఏఏపై ఇప్పటికే అభ్యంతరం తెలిపిన అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలహీనపడే సూచనలు కన్పిస్తున్నాయని చెబుతున్నారు.

ఎల్గార్ పరిషద్​ కేసులో మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో స్టాన్​ స్వామిని 2020 అక్టోబరులో ముంబయిలోని తలోజా సెంట్రల్​ జైలుకు తరలించారు. ఆయనపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద కేసు నమోదు చేశారు. కొవిడ్​తో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడ్డ 84 ఏళ్ల స్టాన్ స్వామి.. ఆస్పత్రిలో వెంటిలేటర్​పై చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన చివరి రోజుల వరకు బెయిల్​ కోసం పోరాడారు.

ఇదీ చూడండి: స్టాన్ స్వామి మృతి- కేంద్రంపై విపక్షాల ధ్వజం

ఎల్గార్ పరిషద్ కేసు 2018 జనవరి 1న బీమా కొరేగావ్​లో జరిగిన హింసాత్మక ఘటనకు సంబంధించినది. దళితులు సమావేశమైన మరునాడే ఈ ఘర్షణ చెలరేగింది. హింసలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

అమెరికా విదేశాంగ మంత్రి ప్రస్తావన

2021 మార్చి 10న స్టాన్ స్వామి కేసు విషయం గురించి తెలుసుకుంటామని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ తెలిపారు. విదేశీ వ్యవహారాల కమిటీ సమావేశంలో ప్రతినిధుల సభ సభ్యుడు అడిగిన ఓ ప్రశ్నకు బదులుగా ఈ సమాధానం ఇచ్చారు. స్టాన్​ స్వామిని సుదీర్ఘ కాలం జైల్లో ఉంచడం తీవ్ర అన్యాయమని హౌస్​​ ఇంటర్నేషనల్​ ఎకానమిక్​ పాలసీ అండ్ మైగ్రేషన్​ సబ్​కమిటీ వైస్ ఛైర్మన్​ జువాన్ వర్గాస్​ వ్యాఖ్యానించారు. అమెరికా విదేశాంగ శాఖ మానవహక్కుల నివేదిక-2020లో కూడా స్టాన్​ స్వామి పేరు ఉంది.

సీఏఏపైనా..

బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ నుంచి భారత్​కు వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం కల్పించే పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) కూడా అమెరికా స్వాగతించలేదు. ఇంటర్నెట్ సదుపాయం పొందడం ప్రాథమిక హక్కు అని భారత సుప్రీంకోర్టు చెప్పినా.. ప్రభుత్వం అంతర్జాల సేవలపై ఆంక్షలు విధించిన విషయాన్ని కూడా అమెరికా విదేశాంగ శాఖ మానవ హక్కుల నివేదిక ప్రస్తావించింది. ఇంటర్నెట్ నిషేధం, ఆన్​లైన్​ కంటెంట్​పై సెన్సార్​షిప్, డిజిటల్​ మీడియా వినియోగదారులపై ప్రభుత్వం నిఘా వహిస్తోందనే విషయాలను పేర్కొంది.

భారత్​లో మతపరమైన స్వేచ్ఛ, సైబర్ చట్టాలు వంటి మానవహక్కుల సంబంధిత విషయాలను అమెరికా పలుమార్లు లేవనెత్తింది. మానవ అక్రమ రవాణా నియంత్రణలోనూ భారత ప్రభుత్వం విఫలమైందనే విషయాన్ని కూడా అమెరికా విదేశాంగ శాఖ నివేదిక పేర్కొంది. భారత్​ను ప్రాధాన్య దేశాల జాబితాలో చేర్చిన అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ భావిస్తున్న తరుణంలో.. ఈ మానవ హక్కుల ఉల్లంఘనల అంశం అమెరికా దృష్టికి రావడం రెండు దేశాల సంబంధాలపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఐరాస విమర్శలు..

స్టాన్ స్వామి మరణం అనంతరం ఐరాస మానవ హక్కుల కమిషన్ కార్యాలయం కూడా భారత ప్రభుత్వాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రాథమిక హక్కులైన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, శాంతియుత నిరసనలు చేపట్టే వారిని నిర్బంధించకుండా చూడాలని సూచించింది. చట్టపరమైన నిబంధనలు పాటించకుండా అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని పేర్కొంది. మిమర్శలు, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినందుకు జైలుకు తరలించిన వారికి కూడా విముక్తి కల్పించాలంది.

ఇదీ చూడండి: 'పోరాడే గొంతుకలను ఆ చట్టాలు నొక్కేస్తున్నాయి'

"భారత్​ నుంచి విన్న ఈ వార్త ఆందోళనకరంగా ఉంది. మానవహక్కుల పరిరక్షుడు ఫాదర్​ స్టాన్ స్వామిపై ఉగ్రవాదానికి సంబంధించి తప్పుడు ఆరోపణలు మోపిన 9 నెలల తర్వాత ఆయన కస్టడీలోనే మరణించారు. మానవ హక్కుల పరిరక్షకులను జైల్లో వేయడం క్షమార్హం కాదు." అని ఐరాస మానవహక్కుల ప్రత్యేక రిపోర్టర్​ మేరీ లాలోర్ అన్నారు.

ఈయూ కూడా..

స్టాన్ మరణ వార్త అత్యంత బాధాకరమని, ఆయనపై కేసు అంశాన్ని తాము చాలా సార్లు లేవనెత్తామని ఐరోపా సమాఖ్య మానవహక్కుల ప్రత్యేక ప్రతినిధి ఈమన్​ గిల్మోర్ వ్యాఖ్యానించారు.

అమెరికాతో సంబంధాలు బలోపేతం చేసుకోవాలని భారత్ భావిస్తున్న తరుణంలో అంతర్జాతీయంగా ఇలాంటి విమర్శలు రావడం ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: స్టాన్‌ స్వామి మృతిపై వెల్లువెత్తుతున్న నిరసనలు!

ABOUT THE AUTHOR

...view details