తెలంగాణ

telangana

ETV Bharat / bharat

142Cr Fine to Mining Trader: మహానాడుకు విరాళం ఇచ్చారని భారీ జరిమానా.. ఎంతో తెలిస్తే షాక్​ అవ్వడం పక్కా

Big Fine to Mining Trader Kavya Krishna Reddy: ఆయన వైసీపీ నేత. చాలాకాలం నుంచి మైనింగ్​ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆయన చూపు టీడీపీ వైపు మళ్లింది. కొద్దిమంది పార్టీనేతలతో టచ్​లో కూడా ఉన్నారు. అంతేకాకుండా కొన్నిరోజుల క్రితం మహానాడుకు విరాళం కూడా అందించారు. అయితే ఇప్పుడు ఆయనను ప్రభుత్వం టార్గెట్​ చేసింది. ఆయన వ్యాపారంలో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ జరిమానా విధించింది. ఇంతకీ ఆ జరిమాన ఎంతంటే..?

By

Published : Jun 21, 2023, 12:41 PM IST

142Cr Fine to Mining Trader
142Cr Fine to Mining Trader

Big Fine to Mining Trader Kavya Krishna Reddy: ఆయన నెల్లూరు జిల్లాకు చెందిన అధికార పార్టీ నేత. గత ఎన్నికల నుంచి ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. చాలా కాలంగా కాంట్రాక్టు పనులు, రహదారి, కంకర క్వారీ ద్వారా మైనింగ్‌ వ్యాపారం చేస్తున్నారు. ఇటీవల ఆయన చూపు తెలుగుదేశం వైపు మళ్లింది. ఆ పార్టీ ఇటీవల రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడులో కోటి రూపాయలు విరాళం అందజేశారు. ఇంకేముందు.. వెంటనే వైసీపీ ప్రభుత్వం ఆయన్ను లక్ష్యంగా చేసుకుంది. గనులశాఖ అధికారులను రంగంలోకి దించి.. కంకర వ్యాపారంలో ఆయన అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 142 కోట్ల రూపాయల జరిమానా విధించేందుకు సిద్ధమైంది.

ఇదీ కావలికి చెందిన దగుమాటి వెంకట కృష్ణారెడ్డి (కావ్య కృష్ణారెడ్డి)పై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు విధానం. కావ్య కృష్ణారెడ్డి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయనకు.. కావలి నియోజకవర్గ పరిధిలో క్వారీ, క్రషర్లు ఉన్నాయి. దాదాపు 15 సంవత్సరాలుగా ఆయన మైనింగ్‌ వ్యాపారం చేస్తున్నారు. ఈసారి టీడీపీ తరపున బరిలో నిలవాలని భావిస్తున్నారు. ఆ పార్టీ నేతలతో టచ్‌లో కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే మహానాడుకు రూ.కోటి విరాళం కూడా ఇచ్చారు. దీంతో ఆయన్ను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేయడంపై వైసీపీ ప్రభుత్వం దృష్టిసారించింది.

ఇలా ఫిర్యాదు.. అలా జరిమానా..: కావలి నియోజకవర్గ పరిధిలోని అన్నవరం, గట్టుపల్లి గ్రామాల్లో అక్రమంగా కంకర, గ్రావెల్‌ తవ్వి తరలిస్తున్నట్లు స్పందన కార్యక్రమంలో కొందరితో కలెక్టర్‌కు ఫిర్యాదు చేయించారు. ఆ వెంటనే సీఎంవో అధికారులు తెరమీదకు వచ్చారు. విచారణ జరపాలంటూ గనులశాఖను ఆదేశించారు. తొలుత నెల్లూరు, ప్రకాశం జిల్లాల అధికారులతో విచారణ జరిపేందుకు సిద్ధమవ్వగా.. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారుల నుంచి ఒత్తిళ్లు రావడంతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందం దాదాపు పది రోజుల పాటు క్వారీల్లో తనిఖీలు నిర్వహించింది. అన్నవరంలోని రాఘవేంద్ర క్రషర్‌, గట్టుపల్లిలోని గురురాఘవేంద్ర క్వారీ, క్రషర్‌లో తనిఖీలు చేపట్టింది. అలాగే అన్నవరంలో గడువు ముగిసిన ఇతర లీజుల్లోనూ గనులశాఖ తనిఖీలు నిర్వహించారు. ఆ తనిఖీల్లో భారీగా అక్రమాలు జరిగాయని తేల్చారు. వీటన్నింటికీ సీనరేజ్‌ ఫీజు, అంతే విలువైన కన్సిడరేషన్‌ నగదు, 30 శాతం జిల్లా డీఎంఎఫ్‌, 2 శాతం ఖనిజాన్వేషణ ట్రస్ట్‌ (మెరిట్‌), పదింతల ఫైన్​ కలిపి మొత్తం రూ.142 కోట్ల మేరకు చెల్లించాలని నివేదిక రూపొందించారు. ఈ నివేదిక గనులశాఖ సంచాలకుని కార్యాలయానికి చేరింది.

ఈ నాలుగేళ్లలో ఎందుకు కనిపించలేదో?: అయితే ఆ ప్రాంతంలో ఆయన ఇన్ని సంవత్సరాలుగా మైనింగ్‌ వ్యాపారం చేస్తుండగా.. ఇంతకాలం కనిపించని ఈ అక్రమాలు ఇప్పుడే ప్రభుత్వానికి ఎందుకు కనిపించాయనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటివరకు గనులశాఖ, విజిలెన్స్‌ అధికారులు ఎందుకు పట్టించుకోలేదు? పర్మిట్లు ఎలా జారీ చేస్తూ వచ్చారు? టైం అయిపోయినా ఆయన లీజుకు రెన్యువల్‌కు ఎలా సిఫార్సు చేశారు? వంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో రహదారి కంకర క్వారీల్లో పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్‌ జరుగుతోంది. మట్టి మాఫియా చెలరేగిపోతోంది. కొండలు, గుట్టలు, చెరువులను ఊడ్చేస్తున్నారు. నేతలు లారీకి కొంత మొత్తం చొప్పున వసూలు చేసి గ్రానైట్‌ను భారీగా పక్క రాష్ట్రాలకు పంపుతున్నారు. ఇసుకలో జరుగుతున్న దోపిడీ గురించి ఎంత చెప్పినా తక్కువే. వీటిపై మీడియాలో ఎన్ని కథనాలు వచ్చినా, స్థానికులు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అటువైపు చూడని గనులశాఖ.. ప్రభుత్వ పెద్దలు ఆదేశిస్తే మాత్రం ఉల్లంఘనలు జరిగాయంటూ కొందరిపై వేధింపులకు సిద్ధమవుతోందనే విమర్శలు వస్తున్నాయి. మహానాడుకు విరాళం ఇచ్చారు కాబట్టి ఆయనకు భారీ జరిమానా విధించారని.. లేకపోతే అటువైపు కూడా అధికారులు చూడరనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details