గుజరాత్ రెండో విడత ఎన్నికలకు కొన్ని గంటల ముందు దంతా నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. తమ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాంతీ ఖరాడీ ఆచూకీ తెలియడంలేదని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. అయితే తాను సురక్షితంగానే ఉన్నట్లు తెలిపిన కాంతీ ఖరాడీ.. "భాజపా గూండాలు" తనపై దాడి చేశారని ఆరోపించారు.
'గుజరాత్లో ఎన్నికల వేళ.. కాంగ్రెస్ అభ్యర్థిపై హత్యాయత్నం!' - రాహుల్ గాంధీ లేటెస్ట్ ట్వీట్
గుజరాత్లో రెండో విడత ఎన్నికలు జరుగుతుండగా దంతా నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని ఓ భాజపా అభ్యర్థి చంపడానికి ప్రయత్నించారని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది.

ఖరాడీ ఓటర్లను కలిసేందుకు బోర్డియాలా ప్రాంతానికి కారులో వెళ్లగా.. భాజపా అభ్యర్థి లధు పరిగి అనుచరులతో కలిసి తనపై ఆయుధాలతో దాడిచేశారని పేర్కొన్నారు. అక్కడి నుంచి తప్పించుకుని 15 కిలోమీటర్లు పారిపోయి.. అడవుల్లో తలదాచుకున్నట్లు మీడియాకు వివరించారు. కాంతీని హత్యచేయడానికి భాజపా అభ్యర్థి యత్నించారని కాంగ్రెస్ నేత జిగ్నేష్ మేవానీ ఆరోపించారు. మరోవైపు తనపై దాడి జరిగే అవకాశం ఉందని 4 రోజుల క్రితం ఎన్నికల కమిషన్‌కు కాంతీ లేఖ రాశారు. అప్పుడే చర్యలు తీసుకొని ఉంటే తనపై దాడి జరిగేది కాదని కాంతీ ఆవేదన వ్యక్తం చేశారు.