Chhattisgarh government buy cow urine: ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఆవు మూత్రాన్ని కొనుగోలు చేసే పథకాన్ని ప్రారంభించనుంది. ఈ మేరకు లీటర్ ఆవు మూత్రాన్ని రూ.4 చొప్పున కొనుగోలు చేయనున్నట్లు సోమవారం ప్రకటించింది. 'హరేలీ' (రైతు పండుగ) పర్వదినాన్ని పురస్కరించుకొని జులై 28న కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపింది. 'గోధన్ న్యాయ్ యోజన' పథకం కింద ఇప్పటికే ఆవు పేడను కొనుగోలు చేస్తుండగా.. తాజాగా మూత్రాన్ని కూడా సేకరించనున్నట్లు పేర్కొంది. రైతులు, పశుపోషకులను ప్రోత్సహించి.. గ్రామీణుల ఆదాయాన్ని పెంచేలా రెండేళ్ల కింద ఈ పథకాన్ని తీసుకువచ్చారు.
ప్రస్తుతానికి మొదటి విడతగా జిల్లాకు రెండు చొప్పున కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. వీటి నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీని నియమించినట్లు చెప్పారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు శిక్షణ ఇచ్చి.. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. ఎరువులు, క్రిమి సంహారక ఉత్పత్తుల తయారీలో గోమూత్రాన్ని వినియోగిస్తారని పేర్కొన్నారు. అంతకుముందు 2020 జులైలో 'హరేలీ' పండుగ నేపథ్యంలో గోధన్ న్యాయ్ యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద కిలో ఆవు పేడను రూ.2కు కొనుగోలు చేస్తారు. గత రెండేళ్లలో సుమారు రూ.150 కోట్ల విలువైన 20 లక్షల క్వింటాళ్ల పేడను కొనుగోలు చేశారు.