Gujarat CM Bhupendra Patel: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన భాజపా.. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్.. శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని రాజ్ భవన్‌కు వెళ్లి గవర్నర్ ఆచార్య దేవవ్రత్కు సమర్పించారు.
రాజ్ భవన్లో గవర్నర్‌కు పుష్పగుచ్ఛం ఇస్తున్న భూపేంద్ర పటేల్ మరోవైపు, శనివారం గాంధీనగర్‌లోని పార్టీ కార్యాలయంలో గుజరాత్‌కు కాబోయే ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది భాజపా. ఈ సమావేశానికి పరిశీలకులుగా పార్టీ సీనియర్ నేతలు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, యడియూరప్ప, అర్జున్ ముండా నియమితులయ్యారు.
కాగా, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ కొనసాగుతారని భాజపా గతంలోనే ప్రకటించింది. ముఖ్యమంత్రిగా ఆయన రెండోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. డిసెంబర్ 12వ తేదీన ఈ కార్యక్రమం ఘనంగా జరగనుంది. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.
2022 ఎన్నికల్లో కాంగ్రెస్ దాదాపు 50కిపైగా సీట్లను కోల్పోగా.. ఆ మేరకు భాజపా లబ్ధిపొందింది. భాజపా అధికారంలోకి రావడం వరుసగా ఇది ఏడోసారి. 1985లో జరిగిన ఎన్నికల్లో 149 స్థానాల్లో గెలుపొంది కాంగ్రెస్ రికార్డు సృష్టిస్తే.. ఈసారి భాజపా 156 సీట్లు సాధించి ఆ రికార్డును తిరగరాసింది.