గుజరాత్‌లో రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్ర తదుపరి సీఎంగా భూపేంద్ర పటేల్ ఎంపికయ్యారు. గాంధీనగర్‌లో ఆదివారం జరిగిన భాజపా ఎమ్మెల్యేల సమావేశంలో భూపేంద్ర పేరును మాజీ సీఎం విజయ్ రూపానీ ప్రతిపాదించారు. భాజపా అధిష్ఠానం పంపించిన పరిశీలకులు.. నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ జోషి సమక్షంలో శాసనసభాపక్ష నేతగా భూపేంద్ర పటేల్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు పార్టీ ఎమ్మెల్యేలు.
భాజపా ఎమ్మెల్యేల సమావేశంలో భూపేంద్ర పటేల్ గుజరాత్ సీఎంగా విజయ్ రూపానీ(vijay rupani resignation) శనివారం రాజీనామా చేయడం వల్ల రాష్ట్ర రాజకీయాలు అనూహ్య మలుపు తిరిగాయి. రూపానీ వారసుడెవరు? సీఎం పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారు? అని సర్వత్రా చర్చలు జరిగాయి. దీనికి ముగింపు పలుకుతూ భూపేంద్ర పటేల్‌ను తదుపరి సీఎంగా ప్రకటించింది భాజపా. 59ఏళ్ల భూపేంద్ర.. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఘట్లోడియా నియోజకవర్గం నుంచి గెలుపొందారు. త్వరలో సీఎంగా ఆయన ప్రమాణస్వీకారం చేస్తారని తెలుస్తోంది.
పటేలే ఎందుకు?
రూపానీ రాజీనామా అనంతరం ఆ పదవి పటీదార్లకే దక్కుతుందని ఊహాగానాలు జోరుగా సాగాయి. వాటిని నిజం చేస్తూ పటీదార్ అయిన భూపేంద్ర పటేల్‌ను నియమించింది. సీఎం రేసులో నిలిచిన మిగిలిన నేతలు కూడా పటీదార్లే కావడం గమనార్హం.
అయితే వచ్చే ఏడాది డిసెంబర్లో జరగనున్న ఎన్నికల కోసం భాజపా(gujarat bjp news) ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. శ్రీరాముడి వారసులుగా చెప్పుకునే పాటీదార్ల/పటేల్ వర్గం గుజరాత్‌లో బలమైన సామాజిక వర్గం. ఉత్తర గుజరాత్, సౌరాష్ట్రలో ఈ వర్గం ఎక్కువగా ఉంటుంది. రాష్ట్ర జనాభా 6కోట్ల వరకు ఉండగా.. అందులో 12-14శాతం అంటే దాదాపు 1.5కోట్ల నుంచి 2 కోట్ల వరకు పటేల్ జనాభా ఉంటారని అంచనా. రాష్ట్రంలోని మొత్తం 182 స్థానాల్లో 70కి స్థానాల్లో వీరు ప్రభావం చూపగలరు.
1970 చివరి వరకు వీరు కాంగ్రెస్‌కు మద్దతుదారులుగా ఉండేవారు. 1980ల్లో కాంగ్రెస్ మాజీ సీఎం మాధవ్‌సింగ్ సోలంకీ ఖామ్ కూటమి(క్షత్రియ, హరిజన, ఆదివాసీ, ముస్లిం)పై దృష్టిపెట్టారు. ఈ పరిణామాలతో పటేల్ వర్గం.. కాంగ్రెస్‌కు దూరమయింది. ఆ తర్వాత నెమ్మదిగా భాజపావైపు మళ్లారు. పాటిదార్ల మద్దతుతోనే గత రెండు దశాబ్దాలుగా భాజపా గుజరాత్‌లో అధికారంలో కొనసాగుతోంది.
అతిపెద్ద సవాలు అదే!
కొవిడ్ కట్టడిలో వైఫల్యం, పటీదార్లలో అసంతృప్తి కారణంగా విజయ్ రూపానీని అధిష్ఠానం తప్పించినట్టు తెలుస్తోంది. 2022 చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భాజపా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇదే నిజమైతే.. ఆ ఎన్నికల్లో భాజపాను విజయతీరాలకు చేర్చడం ఇప్పుడు భూపేంద్ర ముందున్న అతిపెద్ద సవాలు. అన్ని వర్గాల ప్రజలను భూపేంద్ర కలుపుకుని ముందుకు సాగుతారనే నమ్మకంతో ఆయనకు కీలక పదవిని అప్పజెప్పింది కమలదళం.
ఇదీ చూడండి:-