గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ మరోసారి పగ్గాలు చేపట్టనున్నారు. ఈ నెల 12న మధ్యాహ్నం 2 గంటలకు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్షా ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు.
మరోసారి గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్.. ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే.. - గుజరాత్‌లో భూపేంద్ర పటేల్ విజయం
భూపేంద్ర పటేల్ మరోసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నెల 12న మధ్యాహ్నం 2 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
శాసనసభ ఎన్నికల్లో భాజపా ప్రభంజన విజయంపై భూపేంద్ర హర్షం వ్యక్తం చేశారు. "గుజరాత్ ప్రజలు మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై, భాజపా నాయకత్వంపై విశ్వాసం కనబరిచారు. వారి అంచనాలకు అనుగుణంగా మేం పనిచేస్తాం." అని అన్నారు. ఈ ఎన్నికల్లో గుజరాత్ ప్రజలు దేశవ్యతిరేక అంశాలను తిరస్కరించారని, రాష్ట్ర అభివృద్ది కోసం భాజపాకు మరోసారి ఓటు వేశారని వ్యాఖ్యానించారు.
అఖండ విజయం..
భూపేంద్ర పటేల్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేసిన స్థానంలో ఘన విజయం సాధించారు. భారతీయ జనతా పార్టీ తరఫున అహ్మదాబాద్ జిల్లాలోని ఘట్లోడియా స్థానం నుంచి పోటీ చేసిన ఆయన.. కాంగ్రెస్ అభ్యర్థి ఆమ్నీ యాగ్నిక్పై 81 వేలకు పైగా ఓట్లతో గెలిచారు. ఆమ్నీ యాగ్నిక్కు 9900 ఓట్ల వచ్చాయి. మొత్తం ఈ నియోజకవర్గంలో 59.62 శాతం ఓట్లు.. అంటే లక్షా ఏడు వందల ఓట్లు పోలయ్యాయి. ఇందులో భూపేంద్ర పటేల్ ఏకంగా 81 శాతం ఓట్లు పొందారు.