కరోనా రోగులకు అన్నదాతగా మారిన ఆదర్శ కుటుంబం ఓవైపు కరోనా మహమ్మారి ధాటికి దేశం అతలాకుతలమవుతుంటే.. మరోవైపు వైరస్ బారినపడిన కుటుంబాలకు అన్నదానం చేస్తూ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు ఒడిశా భువనేశ్వర్‌కు చెందిన దంపతులు. ఆకలితో ఉన్నవారి కడుపు నింపుతున్న ఈ కుటుంబం.. తమ నిస్వార్థ సేవతో పలువురి ప్రశంసలు అందుకుంటోంది.
చూసి.. చలించి..
భువనేశ్వర్‌లోని ఉత్కల్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకులుగా పనిచేసే తపస్ పాండా, రాజశ్రీ పాండా దంపతులు. కొవిడ్ రోగుల ఆకలి బాధలు కళ్లారా చూసిన వారు.. ఎలాగైనా వారికి అండగా నిలవాలనుకున్నారు. అలా.. వారి పిల్లల సాయంతో రోజూ కరోనా రోగులకు ఆహారం వండిపెట్టి ఎంతోమంది కడుపునింపుతున్నారు. అంతేకాదు.. వారికి అవసరమైన మందులు కూడా ఉచితంగానే అందిస్తున్నారు.
ఆహార ప్యాకెట్లను సిద్ధం చేస్తున్న పాండా కుమార్తె ఇదీ చదవండి:హోం ఐసోలేషన్ కొత్త మార్గదర్శకాలు ఇవే!
సోషల్ మీడియాలోనూ పోస్ట్..
తాము అందించే సాయం మరింత మందికి చేరాలనే లక్ష్యంతో.. సోషల్ మీడియాలో ఇటీవల ఓ పోస్ట్ కూడా పెట్టారు పాండా దంపతులు. 'గృహ నిర్బంధంలో ఉన్న కొవిడ్ రోగులు, వృద్ధుల కోసం ఉచిత ఆహార సరఫరాతో పాటు వారికి అవసరమైన మందులూ ఉచితంగానే ఇస్తాం' అని అందులో పేర్కొన్నారు.
నిస్సహాయ స్థితిలో ఉన్న వారి ఆకలి బాధలను తాము పూర్తిగా గ్రహించామని.. అందుకే సొంత ఖర్చుతో ఈ రకంగా సేవ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు తపస్ పాండా.
"రోగుల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తక్కువ నూనె, సుగంధ ద్రవ్యాలతో వండుతాం. తొలుత.. అన్నం, పప్పు, ఇతర వంటకాలతో భోజనం పార్సిల్ సిద్ధంగా ఉంచుకుంటాం. ఫోన్ కాల్ రాగానే.. నేనే వారి ఇంటికి వెళ్లి భోజనం అందజేస్తాను. దీంతో మా కుటుంబం ఎంతగానో సంతృప్తిగా ఉంది."
- తపస్ పాండా
ఈ ఆహార పంపిణీ కార్యక్రమాన్ని ఈ ఏడాది జనవరి 4 నుంచి ప్రారంభించామంటున్నారు తపస్ సతీమణి రాజశ్రీ. ప్రస్తుతం.. రోజుకు 40 మందికి ఆహారం అందిస్తున్నామని వివరించారు.
ఇదీ చదవండి:లాక్డౌన్ భయాలు- పొగాకు కోసం బారులు