భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. 9 శాతం శరీరం కాలిపోయిందని.. చికిత్స కొనసాగుతోందని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
రాజస్థాన్‌కు చెందిన ముస్కాన్, రాయిస్ ఖాన్ భార్యభర్తలు. వీరికి మూడేళ్ల కింద వివాహం కాగా.. అక్కడ నుంచి భోపాల్‌కు వలస వచ్చారు. అయితే, పెళ్లైన ఏడాది నుంచి భార్యను కట్నం కోసం వేధిస్తున్నాడు రాయిస్ ఖాన్. దీంతో ఆగ్రహానికి గురైన మహిళ ఒంటరిగా జీవించాలని నిర్ణయించుకుంది. ఎనిమిది నెలల కింద వెళ్లిపోయి.. నగరంలోని ఓ వృద్ధాశ్రమంలో పనిచేస్తోంది. ఈ క్రమంలో వృద్ధాశ్రమం సమీపంలో ఆమెను అడ్డగించిన భర్త.. తనతో రాజస్థాన్‌కు రావాలని కోరాడు. దీనికి ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన రాయిస్.. భార్యపై పెట్రోల్ పోసి నిప్పటించి పరారయ్యాడు.
ఏడేళ్ల బాలికపై ఇద్దరు మైనర్ల అత్యాచారం: రాజస్థాన్ నాగౌర్‌లో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు మైనర్లు. బాలికను డాబా మీదకు తీసుకెళ్లిన నిందితులు.. ఈ అఘాయిత్యం చేశారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.