Bhopal Rally INDIA Alliance :అక్టోబర్ తొలివారం భోపాల్‌లో ఇండియా కూటమి తలపెట్టిన ర్యాలీ రద్దయినట్లు మధ్యప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్ తెలిపారు. ఇటీవల దిల్లీలోని శరద్ పవార్ నివాసంలో జరిగిన కూటమి సమావేశంలో.. భోపాల్‌లో ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, తాజాగా ఈ ర్యాలీ ఎప్పుడంటూ పాత్రికేయులు ప్రశ్నించగా.. అది రద్దయినట్లు కమల్‌నాథ్ తెలిపారు. మరోవైపు ఇండియా కూటమి ర్యాలీపై తమ పార్టీ అధ్యక్షుడు ఇంకా నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్‌సింగ్ సూర్జేవాలా తెలిపారు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే తెలియజేస్తామని చెప్పారు.
బీజేపీ సెటైర్లు
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దీనిపై స్పందించారు. సనాతన ధర్మాన్ని ఉద్దేశించి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై ప్రజాగ్రహం పెల్లుబుకుతున్న నేపథ్యంలో.. ఇండియా కూటమి భోపాల్ ర్యాలీని రద్దు చేసుకుందని విమర్శించారు. సనాతన ధర్మాన్ని అవమానపరిచే వ్యాఖ్యలను మధ్యప్రదేశ్ ప్రజలు సహించరని అన్నారు. ఇప్పటికైనా ఇండియా కూటమి నేతలు వాస్తవాన్ని గ్రహించాలని గ్రహించాలని సీఎం చౌహాన్ హితవు పలికారు.
గత బుధవారం (2023 సెప్టెంబర్ 13న) విపక్ష ఇండియా కూటమి సమన్వయ కమిటీ (INDIA Alliance Coordination Committee) సమావేశం ఎన్సీపీ అధినేత శరద్ పవార్దిల్లీ నివాసంలో నిర్వహించారు. ఈ మీటింగ్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కూటమి తరఫున భారీ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే భోపాల్ ర్యాలీ నిర్వహించాలని.. తొలి సభను అక్టోబర్ తొలి వారంలో ఇక్కడే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.