తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భీమ్ ఆర్మీ చీఫ్​పై కాల్పులు.. పొత్తి కడుపులోకి దూసుకెళ్లిన బుల్లెట్ - azad samaj party chief shot

భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్​పై కాల్పులు జరిగాయి. ఆయన కారులో వెళ్తుండగా మరో వాహనంలో వెంబడించిన దుండగులు.. కాల్పులు జరిపి పారిపోయారు. ఆజాద్ పొత్తికడుపులో బుల్లెట్ దిగిందని.. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పోలీసులు తెలిపారు.

bhim-army-chief-chandrashekhar-azad
bhim-army-chief-chandrashekhar-azad

By

Published : Jun 28, 2023, 7:41 PM IST

Updated : Jun 28, 2023, 8:10 PM IST

దళిత హక్కుల పోరాట సమితి భీమ్ ఆర్మీ చీఫ్, ఆజాద్‌ సమాజ్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్​పై దుండగులు కాల్పులు జరిపారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కాన్వాయ్​పై దాడికి పాల్పడ్డారు. ఉత్తర్​ప్రదేశ్​ సహరాన్​పుర్​లో తన మద్దతుదారుడి నివాసంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఆజాద్​పై కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆయనకు తూటా తగిలింది. దీంతో చికిత్స నిమిత్తం వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉందని పోలీసు అధికారి విపిన్ టాడా తెలిపారు.

"చంద్రశేఖర్ ఆజాద్ కాన్వాయ్​పై దాడి జరిగింది. కొందరు కారులో వెళ్తూ ఆయన కాన్వాయ్​పై కాల్పులు జరిపారు. ఆజాద్​ పొత్తికడుపులోకి తూటా దూసుకెళ్లింది. ప్రస్తుతం ఆజాద్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. ఆయనను చికిత్స నిమిత్తం సీహెచ్​సీ ఆస్పత్రికి తరలించాం. కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు."
-విపిన్ టాడా, పోలీసు అధికారి

కాల్పుల తర్వాత పరార్..
కాల్పులు జరిగిన సమయంలో చంద్రశేఖర్ ఆజాద్.. టయోటా ఫార్చునర్ కారులో ప్రయాణిస్తున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తులు హరియాణా లైసెన్స్ నెంబర్​ ప్లేట్ కలిగిన కారులో వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఆజాద్ కాన్వాయ్​కు దగ్గరికి దూసుకొచ్చి పలు రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఆజాద్ కారులోని సీటు, డోర్​కు బుల్లెట్ తగిలినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన వెంటనే దుండగులు అక్కడి నుంచి పరార్ అయ్యారని పోలీసులు వెల్లడించారు.

సమాజ్​వాదీ ఫైర్
దాడి నేపథ్యంలో చంద్రశేఖర్ ఆజాద్ అనుచరులు, మద్దతుదారులు ఆందోళనకు దిగారు. ఆజాద్ చికిత్స పొందుతున్న ఆస్పత్రికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తమ నాయకుడికి సరైన భద్రత కల్పించలేదని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఈ ఘటనపై ఉత్తర్​ప్రదేశ్​లోని విపక్ష సమాజ్​వాదీ పార్టీ తీవ్రంగా స్పందించింది. ప్రజాప్రతినిధులకే రక్షణ లేకపోతే రాష్ట్రంలో సాధారణ ప్రజల పరిస్థితి ఏమవుతుందని ఆ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ప్రశ్నించారు. ఉత్తర్​ప్రదేశ్​లో ఆటవిక పాలన నడుస్తోందని ట్వీట్ చేశారు. ఎస్పీ సీనియర్ నేత శివపాల్ యాదవ్ సైతం ఈ ఘటనను ఖండించారు. రాష్ట్రంలో నేరస్థులు రెచ్చిపోతున్నారని.. విపక్ష నేతలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు.

Last Updated : Jun 28, 2023, 8:10 PM IST

ABOUT THE AUTHOR

...view details