తెలంగాణ

telangana

ETV Bharat / bharat

AP BJP President Purandeshwari ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పురందేశ్వరినే ఎందుకు? - Bhartiya Janata Party Updates

AP BJP state president Purandeshwari Political Journey: ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర తొలి మహిళా అధ్యక్షురాలుగా దగ్గుబాటి పురందేశ్వరిని..ఆ పార్టీ అధిష్ఠానం నియమించింది. రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆమె నియామకం అయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా.. ఆమె రాజకీయ ప్రస్థానం ఎప్పుడు మొదలైంది..?, ఆమె ఏమీ చదువుకున్నారు..?, ఎన్ని భాషలు మాట్లాడగలరు..?, ఇప్పటివరకూ ఏయే పదవుల్లో కొనసాగారు..?, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆమె నియామకం కావడానికి గల కారణాలు..? అనే అంశాలపై చర్చ సాగుతోంది.

Purandeshwari
Purandeshwari

By

Published : Jul 4, 2023, 6:47 PM IST

Updated : Jul 4, 2023, 10:23 PM IST

AP BJP state president Purandeshwari Political Journey: ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం ఓ కీలక ప్రకటన చేసింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరిని.. ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిర్ణయం మేరకే ఈ నియామకం జరిగిందని తెలియజేస్తూ..ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ నియామక ఉత్తర్వులను జారీ చేశారు. అనంతరం ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియామకం అయిన సందర్భంగా ఆమె రాజకీయ ప్రస్థానం ఎప్పుడు మొదలైంది..?, ఆమె ఏమీ చదువుకున్నారు..?, ఎన్ని భాషలు మాట్లాడగలరు..?, ఇప్పటివరకూ ఏయే పదవుల్లో కొనసాగారు..?, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆమె నియామకం కావడానికి గల కారణాలు..? ఏమిటో తెలుసుకుందామా..!

2014లో బీజేపీలో చేరిన పురందేశ్వరి.. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు కుమార్తె.. దగ్గుబాటి పురందేశ్వరి. ఆమె 1959 ఏప్రిల్‌ 22న జన్మించారు. బీఏ సాహిత్యంతోపాటు జెమాలజీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీషు‌తోపాటు ఫ్రెంచ్‌ భాషలు మాట్లాడగలరు. 2004వ సంవత్సరంలో ఆమె రాజకీయ ప్రవేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన పురందేశ్వరి.. 2004లో బాపట్ల నుంచి, 2009లో విశాఖ నుంచి పోటీ చేసి గెలిచారు. యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగానూ పని చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆమె కాంగ్రెస్‌ పార్టీ తీరును వ్యతిరేకిస్తూ.. పార్టీని వీడారు. అనంతరం 2014వ సంవత్సరంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. అప్పటి నుంచి పార్టీలో కొనసాగుతున్న పురందేశ్వరి..మొదటగా బీజేపీ మహిళా మోర్చా ప్రధాన ప్రభారిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణ సమయంలో పార్టీ పరిశీలకురాలిగా వ్యవహరించారు. ప్రస్తుతం ఒడిశా రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌గా ఆమె కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఈరోజు ఆమెను పార్టీ అధిష్ఠానం.. రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించింది.

రాజకీయాల నుంచి తప్పుకున్న భర్త, కుమారుడు.. 2014 నుంచి బీజేపీలో క్రియాశీలకంగా కొనసాగుతున్న పురందేశ్వరి(64).. ఎన్టీఆర్‌ కుమార్తెగానే కాకుండా రాజకీయ నాయకురాలిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాజీ మంత్రి, మాజీ ఎంపీగా సేవలందించారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇటీవలే తాను, తన కుమారుడు రాజకీయాలకు పూర్తిగా దూరం అవుతున్నట్లు ప్రకటించారు. ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న సమయంలో.. పురందేశ్వరిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించడం వెనుక బీజేపీ వ్యూహం కనిపిస్తోందని రాష్ట్రవ్యాప్తంగా చర్చ సాగుతోంది.

సోము వీర్రాజుపై ఫిర్యాదులు..మూడేళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షునిగా వ్యవహరించినా.. సోము వీర్రాజు స్థానంలో నేడు దగ్గుబాటి పురందేశ్వరిని పార్టీ అధిష్ఠానం నియమించింది. తూర్పు గోదావరి జిల్లా కంతేరుకు చెందిన 66 ఏళ్ల వీర్రాజు..1978 నుంచి వీర్రాజు బీజేపీలో పనిచేస్తున్నారు. 2006-13 రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. 2013-18 రాష్ట్ర కార్యవర్గంలో కొనసాగిన వీర్రాజు.. ఎమ్మెల్సీగా పని చేశారు. 2020 జులై 27 నుంచి బీజేపీలో రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. అతని వ్యవహారశైలిపై గతకొన్ని నెలలుగా రాష్ట్రానికి చెందిన కొంతమంది నేతలు.. పలుమార్లు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు సాగడం లేదని ఆయనపై అసహనం వ్యక్తం చేశారు. తనకు వ్యతిరేక వర్గం అంటూ ఆయన తమపై ఓ ముద్ర వేసి వ్యవహరిస్తున్నారంటూ..అధిష్ఠానికి వారిని గోడును వినిపించారు. ఈ క్రమంలో సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఓ నిర్ణయం తీసుకుంటామంటూ చెప్పుకొచ్చిన అగ్రనేతలు.. ఇప్పుడు తమ ఆలోచనను అమల్లోకి తీసుకొచ్చారు.

తొలి మహిళా అధ్యక్షురాలుగా పురందేశ్వరి.. ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర శాఖకు తొలి మహిళా అధ్యక్షురాలుగా పురందేశ్వరి నేడు నియమాకం అయ్యారు. 2004-05 సంవత్సరానికి ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఆమె ఎంపికయ్యారు. గృహ హింస బిల్లు, హిందూ వారసత్వ సవరణ బిల్లు, మహిళలపై ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటు బిల్లు వంటి వాటిపై అర్ధవంతమైన రచనలు చేశారు. రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని పటిష్ఠం చేసేందుకు వీలుగా పురంధేశ్వరి నియామకం జరిపినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర అధ్యక్షులు వీర్రాజుతో మార్పు అంశాన్ని జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేరుగా ఫోన్‌ చేసి ఈ విషయాన్ని తెలియజేశారు. ' టర్న్‌ ముగిసింది- కొత్త అధ్యక్షురాలికి సహకరించు. ఇన్నాళ్లూ అధ్యక్షునిగా పని చేసిన మీకూ పార్టీ సముచిత గౌరవం కల్పిస్తుంది.' అని జేపీ నడ్డా ఆయనకు హామీ ఇచ్చినట్లు సమాచారం.

కొత్త అధ్యక్షురాలికి శుభాకాంక్షలు..ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షురాలిగా పురందేశ్వరిని నియమించడాన్ని సోము వీర్రాజు స్వాగతించారు. ఈ మేరకు ట్విట్టర్‌ వేదికగా ఆయన పురంధేశ్వరికి శుభాకాంక్షలు తెలిపారు. వివిధ స్థాయిల్లో పురంధేశ్వరి పార్టీకి అందించిన సేవలు, రాజకీయ అనుభవం, రాష్ట్రంలో పార్టీ విస్తరణకు బాగా ఉపయుక్తమవుతాయని ఆకాంక్షించారు.

Last Updated : Jul 4, 2023, 10:23 PM IST

ABOUT THE AUTHOR

...view details