Bharatpur Transgender Neetu :ప్రతీ ఏటా పది మంది పేద కుటుంబాలకు చెందిన అమ్మాయిలకు వివాహాలు చేస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నారు ఓ ట్రాన్స్‌జెండర్. గత 12 ఏళ్ల నుంచి ఇప్పటివరకూ 120 మంది అమ్మాయిలకు పెళ్లిళ్లు చేశారు ట్రాన్స్‌జెండర్. ఈ ఏడాది కూడా ఓ పదిమంది అమ్మాయిలకు వివాహాలను చేశారు. ఆమే రాజస్థాన్‌కు చెందిన నీతూ. ఆ ప్రాంత ప్రజలు నీతూ ఆంటీ అని ఆమెను ముద్దుగా పిలుచుకుంటారు. నీతూ స్వస్థలం భరత్‌పుర్.
పన్నెండేళ్ల క్రితం అందరి ట్రాన్స్జెండర్ల మాదిరిగానే నీతూ కూడా ప్రజల ఇళ్లకు వెళ్లి వారిని దీవించేవారు. ఈ క్రమంలోనే పేద కుటుంబాలకు చెందిన అమ్మాయిలకు పెళ్లిళ్లు చేయడానికి వారి తల్లిదండ్రులు పడే ఇబ్బందులను నీతూ కళ్లారా చూశారు. అలాంటి వారికోసం ఏదైనా మంచి పనిచేయాలనుకున్నారు. ఈ క్రమంలో కొందరు యువతులకు వివాహాలు చేశారు. ఆ తర్వాత ప్రతి ఏటా ఓ పదిమంది హిందూ-ముస్లిం అమ్మాయిలకు పెళ్లిళ్లు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విధంగా గత పన్నెండేళ్లుగా పేద యువతులకు వివాహాలు చేస్తున్నారు నీతూ.
"కన్యాదానానికి మించిన గొప్పదానం లేదు. పేద కుటుంబాలకు చెందిన అమ్మాయిలకు వివాహాలు చేయడం వల్ల నాకు చాలా సంతృప్తి కలుగుతుంది. భవిష్యత్‌లో మరింత మంది పేద పిల్లలకు పెళ్లిళ్లు చేయాలనుకుంటున్నాను. "
-నీతూ, ట్రాన్స్ జెండర్.