దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వానికి ఆసక్తికరమైన విజ్ఞప్తి చేశారు. కరోనా సమయంలో అమూల్యమైన సేవలందించిన వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బందికి ఈ ఏడాదికి గానూ భారతరత్న ప్రకటించాలని సూచించారు. కొవిడ్ వేళ ప్రాణాలు కోల్పోయిన వైద్యులకు ఇదే అసలైన నివాళి అవుతుందని అన్నారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన.. ఇదే విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.
"భారతీయ వైద్యులు ఈ ఏడాది భారతరత్న స్వీకరించాలి. భారతీయ వైద్యులు అంటే ఇందులో దేశంలోని వైద్యులు, నర్సులు, పారామెడిక్ సిబ్బంది ఉంటారు. అమరులైన వైద్యులకు ఇచ్చే అసలైన గౌరవం ఇదే. తమ జీవితాలు, తమ కుటుంబ సభ్యుల జీవితాలను లెక్కచేయకుండా సేవ అందిస్తున్నవారికి అందించే గొప్ప గౌరవం ఇది. మొత్తం దేశం దీనికి ఆనందిస్తుంది."
-కేజ్రీవాల్ ట్వీట్