అర గంటలో వస్తానని... వరదలో కొట్టుకుపోయాడు! సాహసాలు చేయాలన్న తాపత్రయంలో ప్రాణాలను పణంగా పెడుతున్నారు కొందరు యువకులు. వింత సవాళ్లు విసురుకుని ప్రమాదకర చర్యలకు పాల్పడుతున్నారు. కర్ణాటక మైసూర్లో ఓ వ్యక్తి అరగంటలో బయటికొస్తానని సవాలు విసిరి.. కపిలా నదిలోకి దూకాడు. కానీ ఇప్పటి వరకు అతడి జాడలేదు. ఛాలెంజ్ చేశాడు కానీ..
భారీ వర్షాల కారణంగా కపిలా నదిలో వరద ఉద్ధృతి పెరిగింది. మైసూర్-ఊటీ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అదే సమయంలో... బసవపురకు చెందిన ఓ వ్యక్తి నంజన్గుడ్లోని రైల్వే వంతెనపైకి వచ్చాడు. గజ ఈతగాడిలా దుస్తులు ధరించాడు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదిలోకి దూకి ఈదుకుంటూ, అరగంటలో బయటికొచ్చేస్తానని అక్కడున్నవారితో గొప్పగా చెప్పాడు. అమాంతం నీటిలోకి దూకేశాడు. అరగంటలో వస్తానన్నాడు కానీ... గంటలు దాటిపోయినా ఇప్పటివరకు బయటకు రాలేదు.
అడ్డుకోని స్థానికులు...
ఆ వ్యక్తి నదిలో దూకే సమయంలో అతని చుట్టూ చాలా మందే ఉన్నారు. ఓ మనిషి కళ్ల ముందే ప్రమాదకరమైన సాహసానికి పాల్పడుతున్నా.. వీడియోలు తీశారు కానీ.. ఎవరూ అతడిని అడ్డకోవడానికి ప్రయత్నించలేదు.
విషయం తెలుసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదీ చూడండి:వాగు ఉప్పొంగింది.. వారికి తాడే తోడైంది!