'స్వచ్ఛ భారత్' కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణ కోసం తమ వంతు బాధ్యతగా ఇతరులకు అవగాహన కల్పిస్తున్నారు ఎంతో మంది ప్రజలు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తితో తమ గ్రామాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దాలనుకుంది ఉత్తరాఖండ్ దెహ్రాదూన్‌కు చెందిన 13 ఏళ్ల బాలిక ఆస్థా ఠాకూర్.
దెహ్రాదూన్కి 80 కిలోమీటర్ల దూరంలో ఉండే తౌలి గ్రామంలో నివాసముండే ఆస్థా.. తొమ్మిదో తరగతి చదువుతోంది. చిన్నవయసులోనే పర్యావరణ పరిరక్షణకై తనవంతు కృషి చేస్తూ తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తోంది.
పాఠశాల అయిపోయాకా గ్రామంలోని బాల పంచాయతీ విద్యార్థులతో కలిసి పేపర్ బ్యాగులను తయారు చేస్తోంది ఆస్థా. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా వీటిని ఉపయోగించాలని అక్కడి చుట్టుపక్కల ప్రాంతాల్లోని దుకాణాల్లో పంపిణీ చేస్తోంది. పర్యావరణానికి హానికరమైన ప్లాస్టిక్ వాడకాన్ని రోజూ వారి జీవితంలో తగ్గించేందుకు ఈ ఆలోచన చేసింది ఆస్థా.
"ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమమే నాకు స్ఫూర్తి. అప్పటి నుంచి బాల పంచాయత్ బృందంతో కలిసి పేపర్ బ్యాగులను తయారు చేస్తున్నాం. ప్లాస్టిక్ భూతంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. చుట్టుపక్కల దుకాణాలకు పేపర్ బ్యాగులను పంపిణీ చేస్తున్నాం. ప్లాస్టిక్‌కు బదులుగా ప్రజలు వీటిని ఉపయోగిస్తారు."
-ఆస్థా ఠాకూర్, విద్యార్థిని
బాల పంచాయతీ
5 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న 28 మంది పాఠశాల విద్యార్థులతో బాల పంచాయతీని ఏర్పాటు చేసింది ఆస్థా. వీరంతా ప్లాస్టిక్‌పై పోరుకు సిద్ధమయ్యారు. పేపరు బ్యాగులను పంపిణీ చేస్తూ గ్రామాల్లో ప్లాస్టిక్‌ను నిషేధించాలని గత ఏడాది కాలంగా ప్రచారం చేస్తున్నారు. తమ గ్రామాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దాలని నిశ్చయించుకున్నారు. విద్యార్థుల ప్రయత్నాన్ని మెచ్చుకుని వారికి సాయం అందించేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి.
పిల్లల నుంచి నేర్చుకోవాలి..
ఈ కార్యక్రమం చిన్న గ్రామంలో ప్రారంభమైనప్పటికీ దేశవ్యాప్తంగా ప్రచారం పొందుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు ఆస్థా తండ్రి గోపాల్ ఠాకూర్. ఏదో ఒక రోజు దేశమంతా 'బాల పంచాయతీ' ఆలోచన చేరుకుంటుందన్నారు. పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్లాస్టిక్ ఉత్పత్తులను నిషేధించాలని ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.