తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్ణాటకం: ప్రమాణం పూర్తి... మరి తర్వాతేంటీ?

అనేక ఊహాగానాల నడుమ కర్ణాటక ముఖ్యమంత్రిగా యడియూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. ఇక మిగిలింది శాసనసభలో సోమవారం జరిగే బల నిరూపణ ప్రక్రియే. 106 సభ్యుల బలం ఉన్న భాజపాకు ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్​ నెంబర్​ 111ను యడియూరప్ప ఎలా కూడగరతాన్న విషయం ఆసక్తిగా మారింది.

కర్ణాటకం

By

Published : Jul 27, 2019, 4:56 AM IST

Updated : Jul 27, 2019, 8:14 AM IST

ప్రమాణం పూర్తి... మరి తర్వాతేంటీ?

కర్ణాటక ముఖ్యమంత్రి పీఠాన్ని నాలుగోసారి అధిష్ఠించారు బీఎస్ యడియూరప్ప. కన్నడ విధాన సభలో సోమవారం బలనిరూపణ చేసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. రాజీనామా చేసిన కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు సభకు దూరంగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బలనిరూపణపై యడియూరప్ప ధీమాగా ఉన్నారు.

అసలు పరీక్ష

అసంతృప్త ఎమ్మెల్యేల్లో ముగ్గురిపై స్పీకర్‌ అనర్హత వేటు వేశారు. ఫలితంగా స్పీకర్​ మినహాయించి సభలో సభ్యుల సంఖ్య 221కి పడిపోయింది. ప్రభుత్వం మెజార్టీ నిరూపించు కోవాలంటే 111 మంది సభ్యుల మద్దతు ఉండాలి.

ప్రస్తుతం భాజపాకు 105 మంది సభ్యులుండగా ఒక స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతిస్తానని ప్రకటించారు. భాజపాకు మరో ఐదుగురు మద్దతిస్తేనే యడియూరప్ప విశ్వాస పరీక్షలో గట్టెక్కుతారు. అందుకోసం యడ్డీ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

జేడీఎస్ పరోక్ష మద్దతు!

ఈ సమయంలో భాజపా సర్కార్‌కు మద్దతివ్వాలని కొందరు జేడీఎస్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. తదుపరి వ్యూహాలపై కుమారస్వామి నిర్వహించిన సమావేశంలో కొందరు జేడీఎస్ ఎమ్మెల్యేలు భాజపాకు బయటి నుంచి మద్దతిద్దామని ప్రతిపాదించగా మరికొందరు అంగీకరించలేదు. తుది నిర్ణయాన్ని కుమారస్వామికే వదిలి పెట్టినట్లు మాజీ మంత్రి జీటీ దేవేగౌడ చెప్పారు.

కూటమి తరఫున..

రెబల్స్‌తో కలిపి కాంగ్రెస్ బలం 76, అసంతృప్తులతో కలిపి జేడీఎస్​ బలం 37గా ఉంది. ఒక బీఎస్పీ సభ్యుడు, ఒక నామినేటెడ్ సభ్యుడు, నిర్ణయాత్మక ఓటు వేసే స్పీకర్‌ ఉన్నారు. 14 మంది సభ్యుల రాజీనామాలు, అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఇప్పటి వరకూ నిర్ణయం తీసుకోలేదు. విప్‌ ఉల్లంఘించిన బీఎస్పీ ఎమ్మెల్యే విషయంలో సభాపతి వైఖరి ఏంటనేది ఇంకా తేలలేదు.

ఉపఎన్నిక సవాలు

కాంగ్రెస్-జేడీఎస్​ రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదం పొందినా.. వారిపై అనర్హత వేటు పడినా ఉపఎన్నికలు తప్పనిసరి. ఈ గందరగోళ సమయంలో ఎన్నికల్లో గెలవడం యడియూరప్పకు పెద్ద సవాలుగా మారనుంది.

మంత్రివర్గ కూర్పు మరో చిక్కు

భాజపాతో పాటు అసంతృప్త కాంగ్రెస్​- జేడీఎస్ ఎమ్మెల్యేలతో కూడని నేపథ్యంలో మంత్రి వర్గ కూర్పు కత్తిమీద సామేనని అంచనా వేస్తున్నారు. అసంతృప్త ఎమ్మెల్యేలకు చోటు కల్పిస్తే సొంతపార్టీ వారితో చిక్కులు మొదలయ్యే అవకాశం ఉంది. వారిని సంతృప్తి పరచాల్సి ఉంటుంది.

వయసు దాటినా అవకాశం

యడియూరప్పకు వయసు సమస్యగా మారుతుందన్న ఊహాగానాలు పటాపంచలు అయ్యాయి. 75 ఏళ్లు దాటిన వారిని ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పిస్తున్న భాజపా... యడియూరప్ప విషయంలో అలా చేయలేకపోయింది. దక్షిణాదిన తొలిసారి పార్టీని అధికారంలోకి తెచ్చిన నేతగా 76 ఏళ్లు ఉన్నప్పటికీ యడియూరప్పకే అవకాశం ఇచ్చింది కాషాయ దళం.

ఇదీ చూడండి: యడ్డీ 2.0 : పేరు మార్చుకున్న యడ్యూరప్ప

Last Updated : Jul 27, 2019, 8:14 AM IST

ABOUT THE AUTHOR

...view details