కర్ణాటక భాజపా అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం కూలిన 3 రోజుల అనంతరం.. గవర్నర్ ఆహ్వానం మేరకు అధికార పగ్గాలు చేపట్టారు.
యడ్యూరప్ప 1943 ఫిబ్రవరి 27న మండ్యలో జన్మించారు. పుట్టతాయమ్మ, సిద్దలింగప్ప తల్లిదండ్రులు. యడ్యూరప్పకు ఐదుగురు సంతానం(ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు).
ఇప్పటివరకు మూడు సార్లు కర్ణాటకకు ముఖ్యమంత్రిగా సేవలందించారు. ప్రస్తుతం రాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
ఏసారీ పూర్తికాలం లేరు..
యడ్డీ చివరిసారిగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు అనంతరం.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే.. 225 స్థానాలున్న అసెంబ్లీలో 104 మంది సభ్యుల మద్దతుతో అతి పెద్దపార్టీగా అవతరించినా సభలో బలం నిరూపించుకోలేకపోయింది భాజపా. ఫలితంగా 3 రోజులకే ప్రభుత్వం కూలిపోయింది.
⦁ 2007లో తొలిసారి కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. కానీ.. రెండు వారాలకే రాజీనామా చేశారు.
⦁ 2008 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా గెలుపుతో రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే.. పూర్తి కాలం పాలన సాగలేదు. అవినీతి ఆరోపణలతో 2011లో జైలుకెళ్లగా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. యడ్డీ సీఎం పదవి కోల్పోయారు.
⦁ 2018లోనూ 3 రోజులే సీఎం పదవిలో కొనసాగారు.
ఫలితంగా.. యడ్యూరప్ప 3 సార్లు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినా ఏ ఒక్కసారీ పూర్తి కాలం విధుల్లో కొనసాగలేదు. ఈ సారీ ఎన్నికలు జరిగిన 14 నెలలకు సీఎంగా బాధ్యతలు చేపడుతున్నందున పూర్తి కాలం పదవిలో ఉండే అవకాశం లేదు.