శాసనసభ్యుల రాజీనామాతో కర్ణాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభం రేపు తుది అంకానికి చేరుకుంటుందా లేదా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. రెండు రోజుల విరామం తర్వాత శాసనసభ రేపు సమావేశం కానుంది.
ఎవరిబలమెంతో రేపు తేలుతుంది: యడ్యూరప్ప
కుమార స్వామి ప్రభుత్వానికి రేపే చివరి రోజు అని జోస్యం చెప్పారు కర్ణాటక భాజపా అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప. ఎవరి బలమెంతో సోమవారం శాసనసభలో తేలిపోతుందన్నారు. విశ్వాస పరీక్షకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వానికి స్పష్టం చేశారు.
"రాజీనామా చేసిన 15 మంది ఎమ్మెల్యేలను బలపరీక్షకు రావాలని బలవంతం చేయకూడదని సుప్రీం కోర్టు చెప్పింది. కాంగ్రెస్, జేడీఎస్ జారీ చేసిన విప్‌లకు విలువ లేదు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా సీఎం వ్యవహరిస్తున్నారు. స్పీకర్ రమేశ్ కుమార్, ముఖ్యమంత్రి కుమార స్వామి, సీఎల్పీ నేత సిద్ధరామయ్య రేపటి అవిశ్వాస తీర్మానానికి సిద్ధంగా ఉండాలి. రేపే కుమారస్వామి ప్రభుత్వానికి చివరిరోజు.''
-యడ్యూరప్ప, ప్రతిపక్షనేత
అసంతృప్త ఎమ్మెల్యేల వీడియో..
కర్ణాటక అసంతృప్త ఎమ్మెల్యేలు ఈ రోజు వీడియో విడుదల చేశారు. కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకే తాము ముంబయిలో ఉన్నట్లు చెప్పారు. ఎలాంటి ధన ప్రలోభాలకు లోనవ్వలేదని తెలిపారు. పరిస్థితి సద్దుమణిగాక కర్ణాటక వస్తామని వివరణ ఇచ్చారు.
సుప్రీంలో విచారణ జరిగేనా?
గవర్నర్ ఆదేశాల నేపథ్యంలో ఈనెల 17న సుప్రీంకోర్టు తీర్పులోని విప్ జారీ అంశంపై మరింత స్పష్టత కోరుతూ సీఎం కుమారస్వామి, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండూరావు సుప్రీంకోర్టును శుక్రవారం ఆశ్రయించారు. దీనిపై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరుపుతుందా లేదా అన్నది రేపు తేలే అవకాశం కనిపిస్తోంది
ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో కాంగ్రెస్, జేడీఎస్, భాజపా సోమవారం అనుసరించాల్సిన వ్యూహాలకు పదును పెడుతున్నాయి.